Delhi : కోర్టు విచారణకు.. వర్చువల్‌గా హాజరైన కవిత
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:53 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వర్చువల్‌గా హాజరయ్యారు.
ఈ నెల 25కు వాయిదా
కోర్టులో 4వ అనుబంధ చార్జ్‌షీట్
అందులో శరత్‌రెడ్డి పాత్రపై వివరాలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ కేసులో కవితతోపాటు మరో నలుగురిపై అభియోగాలు మోపుతూ సీబీఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయగా, బుధవారం ఆ కేసు విచారణకు వచ్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా విచారణ చేపట్టారు. కవితతోపాటు మిగిలిన నిందితులు వర్చువల్ పద్ధతిలో విచారణకు హాజరయ్యారు.
తొలుత సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలను వినిపిస్తూ.. ప్రతివాదులకు అందించిన చార్జ్‌షీట్‌లో స్పష్టత లేని ప్రతులను.. బుధవారం అందజేస్తున్నట్లు తెలిపారు. కవిత తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. సీబీఐ చార్జ్‌షీట్ కాపీల్లో పలు పేజీలు తెలుగులో ఉన్నాయని.. వాటిని పూర్తిస్థాయిలో ఇంగ్లి్‌షలోకి అనువాదించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. వాదనలను విన్న ప్రత్యేక న్యాయమూర్తి.. ప్రతివాదులు అడిగిన కాపీలను తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువాదించి ఇవ్వాలని సీబీఐని ఆదేశించారు. తదుపరి విచారణను 25కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
అనుబంధ చార్జ్‌షీట్‌లో శరత్‌రెడ్డి
సీబీఐ బుధవారం దాఖలు చేసిన 4వ అనుబంధ చార్జ్‌షీట్‌లో.. ఈ కుంభకోణంలో అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్‌చంద్రారెడ్డి పాత్రను వివరించారు. కాగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితకు బినామీగా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తోన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళైకి బెయిల్ మంజూరైంది. మనీలాండరింగ్ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఏకసభ్య ధర్మాసనం పిళ్లైకి బెయిల్ మంజూరు చేసింది.