KTR: రేవంత్ సర్కార్‌కి ప్రశ్నలు సంధించిన కేటీఆర్
ABN , Publish Date - Nov 19 , 2024 | 05:53 PM
వికారాబాద్‌లోని లగచర్ల గ్రామంలోని ఇతర రాజకీయ పార్టీల నేతలను ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుసరిస్తు్న వైఖరిని ఈ సందర్బంగా ఆయన ఖండించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.
హైదరాబాద్, నవంబర్ 19: వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దాడి ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతడి ప్రధాన అనుచరుడు సురేశ్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అయినా.. అతడి ఆచూకీ మాత్రం తెలియ రాలేదు.
Also Read: Maharashtra Elections: పోలింగ్ వేళ.. చిక్కుల్లో బీజేపీ
అలాంటి వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయిలో వాడి వేడిగా జరుగుతున్నాయి. దీంతో లగచర్లలో ఏం జరిగిందంటూ అసలు వాస్తవాలు తెలుసుకునే పనిలో ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమైనాయి. అందుకోసం ఆయా పార్టీల నేతలు.. ఆ గ్రామంలోకి వెళ్లేందుకు యత్నిస్తున్నారు.
Also Read: Sabarimala: శబరిమలకు వెళ్తున్నారా.. వాటితో జాగ్రత్త
అయితే వారిని లగచర్ల గ్రామ పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. అందులోభాగంగా భారీగా పోలీసులను మోహరించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా మంగళవారం స్పందించారు. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన పలు ప్రశ్నలు సంధించారు.
Also Read: దబ్బ పండు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?
లగచర్లలో అర్థరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండే కాదు.. పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా ?? అని ప్రశ్నించారు. నిజనిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోంది ? వాస్తవాలను తొక్కిపెట్టాలని ఈ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తోందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. సీఎం సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి ? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా..? లేక లగచర్ల.. చైనా బార్డర్లో ఉన్న కల్లోలిత ప్రాంతమా ?? అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేటీఆర్ ఈ సందర్బంగా నిలదీశారు.
పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా.. లగచర్ల పరిసర ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సేవలను నిలిపి వేశారన్నారు. అలాగే కొడంగల్‌కు వెళ్లే అన్ని దారుల్లో పోలీసుల పహారా ఏర్పాటు చేశారని వివరించారు. మీరెంత దాచే ప్రయత్నం చేసినా.. నిజం దాగదు.. ఇప్పటికే లగచర్లలో కాంగ్రెస్ సర్కారు కిరాతకం ఢిల్లీకి చేరింది.. దేశ రాజధానిలో మీ అరాచకపర్వంపైనే తీవ్ర చర్చ జరుగుతోందంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను అడ్డుకోవడం అంటేనే.. కాంగ్రెస్ సర్కారు తప్పుచేసినట్టు ఒప్పుకున్నట్టే లెక్క అని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు క్షమాపణలు చెప్పాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. లగచర్లలో నిర్బంధాన్ని ఎత్తివేసి.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ రేవంత్ రెడ్డి సర్కారుకు కేటీఆర్ సూచించారు.
For Telangana News And Telugu News...