Share News

Flood Damage: ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:27 AM

ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాలను బుధవారం కేంద్ర బృందం సందర్శించింది. వర్షాలు, వరదలకు నష్టపోయిన బాధితులను పరామర్శించింది.

Flood Damage: ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

  • పంటల నష్టం, వరద నష్టం పరిశీలన

ఖమ్మం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతిప్రతినిధి)/మరిపెడ/డోర్నకల్‌: ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాలను బుధవారం కేంద్ర బృందం సందర్శించింది. వర్షాలు, వరదలకు నష్టపోయిన బాధితులను పరామర్శించింది. బృందం సభ్యులు కల్నల్‌ కేపీ సింగ్‌, మహేష్‌ కుమార్‌, శాంతినాథ్‌ శివప్ప, ఎస్‌కే కుశ్వాహా, టి. నియాల్క్‌హాన్సన్‌, శ్రీ శివనాథన్‌రెడ్డి.. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల వల్ల, మున్నేరు, పాలేరు వరదల కారణంగా జరిగిన ఆస్తి, పంటల నష్టాన్ని పరిశీలించారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, ఖమ్మం రూరల్‌, తిరుమలాయపాలెం మండలాల్లో పర్యటించారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఖమ్మం కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ పంట నష్టం వివరాలను కేంద్ర బృందానికి వివరించారు.


అనంతరం పొలాల్లో వేసిన ఇసుక మేటలను పరిశీలించిన బృంద సభ్యులు.. రైతులతో మాట్లాడారు. వరదల కారణంగా సర్వం కోల్పోయామని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో నష్టపోయిన పంటపొలాలను, జలదిగ్బంధమైన ఇళ్లను కేంద్ర బృంద సభ్యులు బుధవారం రాత్రి పరిశీలించారు. భారీ వరదలతో తన ఇల్లు, పొలం మునిగిపోయాయని, పశువులు, మేకలు, గొర్రెలు, విద్యుత్‌ మోటారు సైతం కొట్టుకుపోయాయని ఉల్లేపల్లి రైతు బంటు ఎల్లయ్య అధికారుల ముందు గోడును వెళ్లబోసుకున్నాడు.


సీతారాంతండాలో ఇస్లావత్‌ మంగీలాల్‌-కవిత దంపతులతో మాట్లాడి ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. అబ్బాయిపాలెం, గాలివారిగూడెం, పురుషోత్తమయగూడెంతో పాటు.. డోర్నకల్‌ మండలం ముల్కలపల్లిలోని ఎస్సీ కాలనీని సభ్యులు సందర్శించి, బాధితులతో మాట్లాడారు. తమకు ఎత్తయిన ప్రదేశంలో ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధితులు ఈ సందర్భంగా మొర పెట్టుకున్నారు. కాగా, కేంద్ర బృందం గురువారం ఖమ్మంలోని మున్నేరు పరిసర ప్రాంతాల్లో పర్యటించనుంది.

Updated Date - Sep 12 , 2024 | 03:27 AM