Tummala: భద్రాద్రి కొత్తగూడెంలో 10 కోట్లతో సీవోఈ!
ABN , Publish Date - Nov 06 , 2024 | 02:52 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహజ, సేంద్రియ వ్యవసాయానికి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)’ ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరు చేయాలన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తికి ఆమోదం తెలిపింది.
తుమ్మల ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం
సహజ, సేంద్రియ వ్యవసాయానికి ఊతం
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహజ, సేంద్రియ వ్యవసాయానికి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)’ ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరు చేయాలన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తికి ఆమోదం తెలిపింది. ఈ విషయంపై తుమ్మల గత నెలలో కేంద్రానికి లేఖ రాశారు. దీనికి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. ఎంఐడీహెచ్ పథకంలో సహజ, సేంద్రియ వ్యవసాయానికి సీవోఈలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భద్రాద్రి కొత్తగూడెంలో సీవోఈ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ కేంద్రాల్లో ఉద్యాన పంటల రైతులకు శిక్షణ, సహకారం అందుతుందన్నారు. అలాగే పామాయిల్ సాగులో జాతీయస్థాయి లక్ష్య సాధనలో రాష్ట్ర ప్రభుత్వం కృషిని చౌహాన్ అభినందించారు.
తుమ్మల విజ్ఞప్తి మేరకు కేంద్ర అధికారుల బృందం త్వరలో తెలంగాణలో పర్యటించి, రాష్ట్ర ప్రభుత్వం, పామాయిల్ రైతులతో సంప్రదింపులు జరుపుతుందన్నారు. తుమ్మల ప్రతిపాదనల మేరకు పామాయిల్ గెలల ధర పెరుగుదలకు ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతానికి పెంచామని చౌహాన్ తెలిపారు. కాగా, ఈ నిర్ణయంతో పామాయిల్ గెలల ప్రస్తుత ధర 19,144కు చేరిందని తుమ్మల పేర్కొన్నారు. రూ.20 వేలు కూడా దాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్ ధర రూ.1,25,000 తగ్గకుండా ఉండేందుకు దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. పెరిగిన ధరలతో రాష్ట్రంలో చాలామంది రైతులు పామాయిల్ సాగు వైపు చూసే అవకాశం ఉందన్నారు.