CEO Vikas Raj: సర్వం సిద్ధం..
ABN , Publish Date - Jun 02 , 2024 | 03:31 AM
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాలు, హాళ్లు, టేబుళ్లు, అధికారులు, సిబ్బంది, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి.. 4న ఉదయం 8కి షురూ
ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు
మధ్యాహ్నం 3కు తొలి ఫలితం, 5 వరకు అన్ని స్థానాల ఫలితాలు
34 కౌంటింగ్ కేంద్రాలు, 10 వేల మంది సిబ్బంది
అన్ని చోట్లా మూడంచెల భద్రత: సీఈఓ వికా్‌సరాజ్
5న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ లెక్కింపు
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాలు, హాళ్లు, టేబుళ్లు, అధికారులు, సిబ్బంది, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మే 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కోసం 19 హాళ్లు, ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున, చేవెళ్ల పార్లమెంటు స్థానంలోని మహేశ్వరంలో మాత్రం రెండు హాళ్లు... మొత్తం 120 హాళ్లను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో మొత్తం 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని, వీటి లెక్కింపు కోసం 276 కౌంటింగ్ టేబుళ్లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం 1,855 టేబుళ్లను ఏర్పాటు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికా్‌సరాజ్ తెలిపారు. శనివారం బీఆర్కే భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల గురించి ఆయన వివరించారు. ఈ మేరకు, తొలుత స్ట్రాంగ్ రూంల నుంచి లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తారు. 4వ తేదీన ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈవీఎంలను టేబుళ్లపైకి చేర్చడం, లెక్కించడం, సరిపోల్చుకోవడం, వాటిని రిటర్నింగ్ అధికారి నిర్ధారించుకుని ప్రకటించడం వంటి ప్రక్రియల కారణంగా తొలి రౌండు ఫలితం వెల్లడికి గంటరన్నర సమయం పట్టనుంది. ఆ తర్వాతి రౌండ్లు త్వరితగతిన పూర్తవుతాయి. ఒక్కో రౌండుకు 20 నిమిషాల సమయం పట్టే అవకాశముంది.
మధ్యాహ్నం 3 గంటలకల్లా తొలి ఫలితం వెలువడుతుంది. అన్ని లోక్‌సభ స్థానాల ఫలితాలు సాయంత్రం 4, 5 గంటలకల్లా వెల్లడవుతాయి. అత్యల్పంగా నిజామాబాద్ లోక్‌సభ స్థానంలోని ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్‌సభ స్థానంలోని అశ్వారావుపేట, మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలోని భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓట్ల లెక్కింపు 13 రౌండ్లలోనే పూర్తి కానుంది. కరీంనగర్‌లోని చొప్పదండి, హైదరాబాద్ స్థానంలోని యాకుత్‌పురా, నల్లగొండలోని దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓట్ల లెక్కింపు అత్యధికంగా 24 రౌండ్ల వరకు కొనసాగుతుంది. చాలా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 18 నుంచి 21 రౌండ్లలో పూర్తవుతోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఐదు పోలింగ్ స్టేషన్లను ర్యాండమ్‌గా ఎంపిక చేసి, వాటిలోని వీవీప్యాట్‌ల ఓటర్ స్లిప్పులను లెక్కిస్తారు. వాటిని, ఈవీఎంలలోని ఓట్లతో సరిపోల్చుకుంటారు. ప్రతి రౌండు ఫలితానికి సంబంధించి రాజకీయ పార్టీల ఏజెంట్లు ఫామ్ ‘17 సీ’పై సంతకం చేయాల్సి ఉంటుంది. అనంతరం రిటర్నింగ్ అధికారి సంతకం చేస్తారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల ఆబ్జర్వర్ ఫలితాన్ని ప్రకటిస్తారు. ఫలితాల కోసం 78 ప్రాంతాల్లో స్ర్కీన్లను ఏర్పాటు చేశారు.
కట్టుదిట్టమైన భద్రత
కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వికా్‌సరాజ్ వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, మొత్తం 12 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. మూడు దశలుగా బందోబస్తు ఉంటుందని, మొదటి దశ కింద కౌంటింగ్ హాల్‌లో, రెండో దశ కింద కౌంటింగ్ క్యాంప్‌సలో, మూడో దశ కింద కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్లలోపు భద్రత ఉంటుందని వివరించారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లోకి ఎలాంటి వాహనాలను అనుమతించబోమని, ఎలకా్ట్రనిక్ ఉపకరణాలను తీసుకురావడానికి వీల్లేదని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బందికి సెల్‌ఫోన్‌లకు అనుమతి ఉండదన్నారు. కౌంటింగ్ కేంద్రంలోని ప్రతి మూలనూ కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ కేంద్రాల వరకు ఈవీఎంల తరలింపు కోసం ప్రత్యేక మార్గాలుంటాయని, ఈ మార్గాలకు బారికేడ్లు, పటిష్ట భద్రత ఉంటుందని తెలిపారు.
ఓట్ల లెక్కింపు కోసం 10 వేల మంది సిబ్బంది సేవలను ఉపయోగించుకుంటున్నామని, నియోజకవర్గాలవారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్‌గా కేటాయిస్తామన్నారు. లెక్కింపు రోజు ఉదయం 5 గంటలకు మరోసారి ర్యాండమ్‌గా సిబ్బందిని కేటాయిస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 49 మంది కేంద్ర ఆబ్జర్వర్లు, 2,414 మందికిపైగా మైక్రో ఆబ్జర్వర్లు ఉంటారని పేర్కొన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కలుపుకొని 800 మంది వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిబ్బంది ఉంటారన్నారు. కౌటింగ్ రోజున మద్యం దుకాణాలు మూసి ఉంచాలని తెలిపారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు అనుమతి ఇస్తే ర్యాలీలు చేసుకోవచ్చన్నారు. ఎలకా్ట్రనిక్ పోస్టల్ బ్యాలెట్ల కోసం 135 ఈటీపీబీఎస్ స్కానర్లను ఏర్పాటు చేశామని వికా్‌సరాజ్ వెల్లడించారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఎలకా్ట్రనిక్ పోస్టల్ బ్యాలెట్లను అనుమతిస్తామన్నారు.