Share News

Tummala Nageshwara rao: కమ్యూనిస్టు యోధులే రామోజీకి స్ఫూర్తి..

ABN , Publish Date - Jul 07 , 2024 | 04:47 AM

చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహనీయుల స్ఫూర్తితో, వామపక్ష భావజాలంతో రామోజీరావు వ్యాపార సంస్థలను నిర్వహించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Tummala Nageshwara rao: కమ్యూనిస్టు యోధులే రామోజీకి స్ఫూర్తి..

  • సీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సంస్మరణ సభలో తుమ్మల

  • సామాజిక ఉద్యమకారుడు రామోజీ: కూనంనేని

హైదరాబాద్‌ సిటీ, జూలై 6(ఆంధ్రజ్యోతి): చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహనీయుల స్ఫూర్తితో, వామపక్ష భావజాలంతో రామోజీరావు వ్యాపార సంస్థలను నిర్వహించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌ (సీఆర్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో శనివారం రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ప్రధాన వక్తగా తుమ్మల మాట్లాడుతూ పత్రికాధిపతిగా రామోజీ నిర్వహించిన పాత్రను శ్లాఘించారు. ప్రజాహితం తప్ప ఆయన ఏ రోజూ ప్రభుత్వాల పక్షాన నిలిచినవాడు కాదని కొనియాడారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రామోజీరావు పైకి పెట్టుబడిదారుడిగా కనిపించినా, ఆయన ఓ సామాజిక ఉద్యమకారుడు అని అభివర్ణించారు.


ఆనాడు కమ్యూనిస్టు పార్టీలో నేర్చుకున్న విలువలే ఆయనను మహామనిషిగా తీర్చిదిద్దాయన్నారు. పత్రికా నిర్వాహకుడిగా రామోజీరావు తెలుగు సమాజానికి విలువైన సేవలు అందించారని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కొనియాడారు. సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ వృద్ధాశ్రమంగా పేరున్న సీఆర్‌ ఫౌండేషన్‌ నిర్మాణం వెనుక రామోజీ ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. అందుకే ఆయన సంస్మరణ సభను తాము ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్టు వివరించారు.

Updated Date - Jul 07 , 2024 | 04:47 AM