Share News

Kollapur: చెంచు మహిళను వివస్త్రను చేసి.. కళ్లు, మర్మాంగాల్లో పచ్చి కారం!

ABN , Publish Date - Jun 21 , 2024 | 02:43 AM

ఓ చెంచు మహిళను నిర్బంధించిన ఆ కౌలుదార్లు అత్యంత క్రూరంగా హింసించారు. వివస్త్రను చేసి కొట్టారు. ఆపై పచ్చి మిరపకాయలను దంచి ఆమె కళ్లలో, మర్మాంగాల్లో పెట్టారు. మర్మాంగాలపై డీజిల్‌ పోసి అగ్గిపుల గీసి కాల్చారు.

Kollapur: చెంచు మహిళను వివస్త్రను చేసి..  కళ్లు, మర్మాంగాల్లో పచ్చి కారం!

  • కౌలుదార్ల దుర్మార్గం.. భూమిని కౌలుకిచ్చి

  • వారి దగ్గరే పనికి వెళుతున్న మహిళ

  • భర్తతో గొడవపడి మరో గ్రామానికి..

  • అక్కడి నుంచి తెచ్చి నిర్బంఽధించి చిత్రహింసలు

  • మర్మాంగాలపై డీజీల్‌.. అగ్గిపుల్ల గీసి చురకలు..

  • నాగర్‌కర్నూల్‌లో ఘోరం.. అదుపులో నలుగురు?

కొల్లాపూర్‌, జూన్‌ 20: ఓ చెంచు మహిళను నిర్బంధించిన ఆ కౌలుదార్లు అత్యంత క్రూరంగా హింసించారు. వివస్త్రను చేసి కొట్టారు. ఆపై పచ్చి మిరపకాయలను దంచి ఆమె కళ్లలో, మర్మాంగాల్లో పెట్టారు. మర్మాంగాలపై డీజిల్‌ పోసి అగ్గిపుల గీసి కాల్చారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆమె పొలాన్ని కౌలుకు తీసుకొని.. ఆమెతోనే కూలీ పనులు చేయిస్తూ.. ఇంట్లో గొడవల కారణంగా కొన్ని రోజులుగా ఆమె పనులకు రాకపోవడంతో ఆగ్రహం చెంది వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధిత కుటుంబానికి చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన బండి శివమ్మ, బండి శివుడు, బండి వెంకటేశ్వర్లు కౌలుకు తీసుకున్నారు. అక్కడే బాధిత మహిళ, భర్తతో కలిసి రోజూ సాగు పనులు చేస్తోంది. పది రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆమె అలిగి పుట్టిల్లయిన తీర్నాంపల్లికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటపడింది.


అయితే ఆమె ఆ గ్రామానికి కాకుండా పరిచయస్తులు ఉన్న చుక్కాయిపల్లి గ్రామానికి వెళ్లింది. భార్య గురించి అత్తామామలకు భర్త ఫోన్‌ చేసి అడగ్గా, ఆమె తమ ఇంటికి రాలేదని వారు చెప్పారు. దీంతో భార్య గురించి ఆందోళన చెందుతుండగానే మరోవైపు కౌలుదార్లు అయిన శివమ్మ, వెంకటేశ్వర్లు, శివుడు.. ఆమె ఆచూకీని గుర్తించి చుక్కాయిపల్లికి వెళ్లారు. ఆమెకు మాయమాటలు చెప్పి గ్రామంలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ ఆమెను నిర్బధించి దాష్టీకాలకు పాల్పడ్డారు. మరోవైపు.. కుటుంబ నియంత్రణ గురించి చెంచు నాయకులు మొలచింతపల్లి గ్రామానికొచ్చి ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పిస్తుండగా ఈ ఘోరం వెలుగుచూసింది. చెంచు నాయకులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారొచ్చి బాధిత మహిళను కాపాడారు.


ఆమె నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెను చికిత్స నిమిత్తం కొల్లాపూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులు వెంకటేశ్వర్లు, శివుడు, శివమ్మపై కిడ్నాప్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పౌర హక్కుల సంఘం ప్రతినిధులు కొల్లాపూర్‌ డీఎస్పీ శ్రీనివా్‌సకు వినిపత్రమిచ్చారు. చెంచు మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని మంత్రి జూపల్లి ఆదేశించారు. చెంచు మహిళపై దాడి ఘటనలో ముగ్గురు నిందితులతో పాటు బాధితురాలి అక్క, బావ కూడా ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. వీరిలో ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - Jun 21 , 2024 | 02:43 AM