Share News

Sankranti: సంక్రాంతికి పల్లెటూరు

ABN , Publish Date - Jan 15 , 2024 | 07:22 AM

హైదరాబాద్‌లో ఆదివారం తెల్లవారుజామునుంచే వీధివీధినా.. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల ముందు పెద్ద ఎత్తున భోగిమంటలు వేసి పిన్నాపెద్దా అందరూ కలిసి అక్కడ గుమిగూడి సరదాగా ముచ్చట్లు చెప్పుకోవడం కనిపించింది. అలాగే రాత్రుళ్లు మహిళలంతా కలిసి కబుర్లు చెప్పుకొంటూ.. వీధి గుమ్మాల్లో అందమైన రంగవల్లులను ఆవిష్కరిస్తున్నారు. ఆనవాయితీ ఉన్నవారు బొమ్మల కొలువులు తీర్చిదిద్దుతున్నారు. పిల్లలేమో అపార్ట్‌మెంట్లు, ఇళ్ల మేడలపైకెక్కి పతంగులు ఎగరేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. మొత్తమ్మీద.. పండుగ ఉత్సాహం ఎల్లెడలా తొణికిసలాడుతోంది.

Sankranti: సంక్రాంతికి పల్లెటూరు

పండుగ వేళ.. ఊరెళ్లిన పట్నంవాసులు

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సందడి

కుటుంబమంతా కలిసి సంబురాలు

గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలోనూ

ఉమ్మడిగా వేడుకలు జరుపుకొంటున్న వైనం

ఫాంహౌస్‌ల్లో సెలబ్రిటీల ప్రత్యేక వేడుకలు

హైదరాబాద్‌లో బోసిపోయిన రోడ్లు

రాష్ట్రం నలుమూలల నుంచి 6,261 ప్రత్యేక

బస్సులు.. కొన్ని ఆంధ్రప్రదేశ్‌కు

పందెం నీదా నాదా?

కోస్తాంధ్ర జిల్లాల్లో కోడి పందేలు, గుండాటల జోరు

ఒక్క పశ్చిమలోనే 200 బరులు.. కోట్లలో పందేలు

పలు బరుల్లో రూ.25లక్షలుంటేనే లోపలికి

అక్కడే పేకాటలు.. ఏరులై పారిన మద్యం

నిర్వాహకుల నుంచి భారీ మొత్తంలో నేతల వసూళ్లు

గోదావరి, కృష్ణా జిల్లాల్లో తొలిరోజే వందల కోట్లు

తెలంగాణ నుంచి భారీగా తరలివచ్చిన ఔత్సాహికులు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): తెలుగువారి పెద్ద పండుగ.. సంక్రాంతి సంబరాలు జోరందుకున్నాయి. ఎంతసేపూ ఇల్లు.. ఆఫీసు.. అంటూ నాలుగు గోడల మధ్య బందీలైపోయి నగరజీవితానికి అలవాటుపడిపోయిన పట్నంవాసుల్లో చాలామంది.. అన్నదమ్ములు, బంధువులతో కలిసి పండుగ జరుపుకోవడానికి పల్లె బాట పట్టారు. నగరంలోనే ఉండిపోయిన గేటెడ్‌ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్‌వాసులూ ఈసారి ఉమ్మడిగా వేడుకలు జరుపుకోవడం ద్వారా పండుగ స్ఫూర్తిని చాటుతుండడం విశేషం. ముఖ్యంగా.. రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం తెల్లవారుజామునుంచే వీధివీధినా.. ఇళ్లు, అపార్ట్‌మెంట్లముందు పెద్ద ఎత్తున భోగిమంటలు వేసి పిన్నాపెద్దా అందరూ కలిసి అక్కడ గుమిగూడి సరదాగా ముచ్చట్లు చెప్పుకోవడం కనిపించింది.

రంగవల్లులు

రాత్రుళ్లు మహిళలంతా కలిసి కబుర్లు చెప్పుకొంటూ.. వీధి గుమ్మాల్లో అందమైన రంగవల్లులను ఆవిష్కరిస్తున్నారు. ఆనవాయితీ ఉన్నవారు బొమ్మల కొలువులు తీర్చిదిద్దుతున్నారు. పిల్లలేమో అపార్ట్‌మెంట్లు, ఇళ్ల మేడలపైకెక్కి పతంగులు ఎగరేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. మొత్తమ్మీద.. పండుగ ఉత్సాహం ఎల్లెడలా తొణికిసలాడుతోంది. సామాన్యుల సందడి ఇలా ఉంటే.. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, డబ్బున్నవారు ఇప్పటికే నగరశివార్లలోని తమ ఫామ్‌హౌజ్‌లకు చేరుకుని పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. కుటుంబసభ్యులతోపాటు.. బంధువులను, తమకు కావాల్సినవారిని అక్కడికి పిలిపించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరీ సంబురాలు చేస్తున్నారు. ఉదాహరణకు.. నగర శివార్లలోని తన ఫామ్‌హౌజ్‌లో స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి గత కొన్నేళ్లుగా సంక్రాంతి వేడుకలు జరుపుకొంటున్న టాలీవుడ్‌ ప్రముఖుడు ఒకరు ఈసారి ఇంకాస్త భారీగా ఏర్పాట్లు చేశారు. అక్కడ అసలు సిసలు పల్లె వాతావరణాన్ని రీ–క్రియేట్‌ చేసి అక్కడికి వస్తున్న తన స్నేహితులు, బంధువులకు కొత్త అనుభూతి పంచుతున్నారు. చాలామంది వ్యాపారవేత్తలు కూడా ఇదే తరహాలో ఘనంగా పండగ చేసుకుంటున్నారు. అలాగే.. కరోనా వల్ల గత మూడేళ్లుగా ఒకచోట కలవని ఉమ్మడి కుటుంబాలు కూడా ఈసారి ఒకమాట ముందే అనుకుని కుటుంబాల రీ–యూనియన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. తెలుగురాష్ట్రాల్లోని నగరాలు, పట్నాల నుంచే కాదు.. ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారిలో చాలా మంది ఈసారి పండగకి ఇక్కడికి.. ఇంటికి.. రావడం అసలు విశేషం. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లోని కలిగిన కుటుంబాలు.. తమ ఇంటి ప్రాంగణంలోనే కోడి పందేలు, పేకాట వంటివి ఏర్పాటు చేయడం గమనార్హం.

అపార్ట్ మెంట్లలోనే ఆటాపాటా..

తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచీ ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్‌కు వచ్చిన లక్షలాది మంది.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లడంతో రాజధాని వీధులన్నీ ఎప్పట్లాగే శనివారం నుంచే బోసిపోయి కనిపించాయి. భోగిమంటల సందడి మాత్రం అపార్ట్‌మెంట్ల వద్ద ఎక్కువగా కనిపించింది. కొన్ని అపార్ట్‌మెంట్లలో అయితే ఈసారి ఊళ్లకు వెళ్లినవారు మినహా మిగతావారంతా సోమవారంనాడు కలిసి భోజనాలు చేయడానికి ప్రణాళికలు వేసుకున్నారు. ‘‘కొన్ని కారణాల వల్ల ఈసారి సొంతూరికి వెళ్లలేదు. అయినా ఆ లోటు తెలియకుండా మా అపార్ట్‌మెంట్‌వాసులందరం కలిసి ఇక్కడే పండుగ చేసుకుంటున్నాం. కోడిపందేలు లేవుగానీ.. చతుర్ముఖపారాయణానికి (పేకాట) ఏర్పాట్లు చేసుకున్నాం’’ అని తణుకుకు చెందిన నాగేశ్వరరావు నవ్వుతూ చెప్పారు. అలాగే.. కొన్ని ఈవెంట్‌ కంపెనీలు నగరశివార్లలోని ఫామ్‌హౌజ్‌లలో టికెటింగ్‌ ఈవెంట్‌గా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నాయి.

Updated Date - Jan 15 , 2024 | 07:52 AM