Share News

CM Revanth Reddy: తెలంగాణకు మంచిరోజులొచ్చాయి

ABN , Publish Date - Aug 26 , 2024 | 03:38 AM

రాష్ట్రంలో ఎవరైనా గంజాయి, డ్రగ్స్‌ గురించి నిద్రలో ఆలోచించాలన్నా భయపడే పరిస్థితి కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: తెలంగాణకు మంచిరోజులొచ్చాయి

  • పభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారీస్‌ ఎజెండా

  • డ్రగ్స్‌ నిర్మూలనకు కార్యాచరణ సంతోషకరం

  • శాంతి సరోవర్‌ భూమి లీజు గడువును పొడిగిస్తాం

  • 22 ఏళ్ల క్రితం సంస్థ ఏర్పాటుకు కృషి: తుమ్మల

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎవరైనా గంజాయి, డ్రగ్స్‌ గురించి నిద్రలో ఆలోచించాలన్నా భయపడే పరిస్థితి కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నషాను అరికట్టడం కోసమే డీజీపీ క్యాడర్‌ అధికారితో తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరోను ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ మూలాలను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పుడు బ్రహ్మకుమారీస్‌ వాళ్లు కూడా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని చేపట్టడంతో రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని అన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి సరోవర్‌ ద్విదశాబ్ధి వేడుకలకు ముఖ్యమంత్రి హాజరై మాట్లాడారు.


ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు.. 22 ఏళ్ల క్రితం మౌంట్‌ అబులోని శాంతి సరోవర్‌ను సందర్శించి, తరువాత ఇక్కడ గచ్చిబౌలిలో ఆ సంస్థను ప్రారంభించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఈ సంస్థను గచ్చిబౌలిలో ఏర్పాటు చేసే సమయానికి ఇక్కడ అభివృద్ధి లేదని, కానీ.. 20 ఏళ్ల తరువాత చూస్తే గొప్ప నగరంగా మారిందని పేర్కొన్నారు. ఓవైపు శాంతి సరోవర్‌ ఉంటే.. మరోవైపు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, దాని పక్కనే ఇన్ఫోసిస్‌, విప్రోతోపాటు గచ్చిబౌలి స్పోర్ట్స్‌ విలేజ్‌ ఉన్నాయని, మొత్తంగా ఈ ప్రాంతం ఒక ఇంటర్నేషనల్‌ హబ్‌గా మారిందంటూ హర్షం వ్యక్తం చేశారు.


విదేశాలకు వెళ్లినప్పుడు, హైదరాబాద్‌ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు.. చార్మినార్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్‌, అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు శాంతి సరోవర్‌ కూడా ఉందని చెప్పుకొనేందుకు గర్వంగా ఉంటుందన్నారు. రైతు ఆత్మహత్యలను నివారించడం, యువతకు నైపుణ్యం కల్పించడం, డ్రగ్స్‌ను నిర్మూలించడం వంటి చర్యల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక ప్రకారమే బ్రహ్మకుమారీస్‌ ఎజెండా ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. తమది ప్రజా, రైతు ప్రభుత్వమని, రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్నది తమ ఆలోచన అని చెప్పారు. అందులో భాగంగానే రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. యువతకు నైపుణ్యాలు నేర్పించాలన్న ఆలోచనతో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని ప్రారంభించామని, దానిని ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో 60ఎకరాల్లో ఈ వర్సిటీని నిర్మిస్తున్నామని, దీనికి రూ.300కోట్ల నిఽధులు కేటాయించామని తెలిపారు.


  • లీజు గడువును రెన్యువల్‌ చేస్తాం..

బ్రహ్మకుమారీస్‌ సంస్థకు తమ ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా నిలబడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సంస్థకు కేటాయించిన భూమి లీజు గడువు త్వరలో పూర్తవుతున్నందున.. దానిని రెన్యువల్‌ చేస్తామన్నారు. కాగా, ‘అందరం ఒక్కటే’ అనే నినాదంతో ముందుకెళ్తున్న బ్రహ్మకుమారీస్‌ సంస్థకు ఈ సంస్థకు అన్నివేళలా అండగా ఉంటామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలోని శాంతిసరోవర్‌ను ఇక్కడ నెలకొల్పడానికి 22 ఏళ్ల క్రితం కృషి చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.


ఇందుకు అవసరమైన భూమిని అప్పటి చంద్రబాబు హయాంలో లీజుకు ఇచ్చామని గుర్తుచేశారు. 139 దేశాల్లో 8,700 కేంద్రాల ద్వారా సేవలందిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంస్థగా బ్రహ్మకుమారీస్‌ ప్రఖ్యాతి గాంచిందన్నారు. బ్రహ్మకుమారీస్‌ సంస్థ నిర్వాహకురాలు శీలా మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఎన్నో పరీక్షలను దాటుకుని సీఎం అయ్యారని, ఇప్పుడు మనమంతా నిశ్చింతగా ఉంటున్నామంటే.. ఆయన ఎంతగా శ్రమిస్తున్నారో అర్ధమవుతోందని అన్నారు. రేవంత్‌రెడ్డి డైనమిక్‌ లీడర్‌ అని, ఎలాంటి సమస్య ఎదురైనా వెనకడుగు వేయకుండా దూసుకెళతారని ప్రశంసించారు. ఎవరు, ఎన్ని రకాలుగా కిందిస్థాయికి తీసుకెళ్లినా తానేంటో నిరూపించుకున్నారని తెలిపారు. సంస్థ కోసం ఈ స్థలం ఇచ్చినప్పుడు కొండలు, గుట్టలే ఉన్నాయని గుర్తు చేశారు. ఆ సమయంలో సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు గుల్జార్‌ దాదీ వస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావుకు చెప్పగానే.. రాత్రికి రాత్రే రోడ్డు వేయించారని తెలిపారు.

Updated Date - Aug 26 , 2024 | 03:38 AM