Education Reform: విద్యాశాఖ.. సమూల ప్రక్షాళన
ABN , Publish Date - Oct 12 , 2024 | 03:05 AM
విద్యాశాఖను సమూల ప్రక్షాళన చేస్తున్నామని, అందుకే ఆ శాఖను తన వద్దే పెట్టుకున్నానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే టీచర్ల పదోన్నతులు, బదిలీల పక్రియ పూర్తి చేసి ప్రభుత్వంపై నమ్మకం కలిగించామన్నారు.
అందుకే ఆ శాఖను నా వద్దే పెట్టుకున్నా
కేసీఆర్ హయాంలో 5 వేల స్కూళ్ల మూత: సీఎం
కొందుర్గులో సమీకృత గురుకులానికి శంకుస్థాపన
రాష్ట్ర వ్యాప్తంగా 28 చోట్ల ఒకే రోజు భూమి పూజ
ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య: సీఎం రేవంత్
కొందుర్గులో సమీకృత గురుకులానికి శంకుస్థాపన
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): విద్యాశాఖను సమూల ప్రక్షాళన చేస్తున్నామని, అందుకే ఆ శాఖను తన వద్దే పెట్టుకున్నానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే టీచర్ల పదోన్నతులు, బదిలీల పక్రియ పూర్తి చేసి ప్రభుత్వంపై నమ్మకం కలిగించామన్నారు. పేదలకు విద్యను చేరువ చేయాలన్న సదుద్దేశంతో యంగ్ ఇండియా సమీకృత గురకులాలు ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని వెల్లడించారు. 1972లో పీవీ నర్సింహారావు దార్శనిక ఆలోచనతో రెసిడెన్షియల్ స్కూల్ విధానాన్ని తీసుకొచ్చారని, అలాంటి స్కూల్‌లో చదువుకొనే బుర్రా వెంకటేశం వంటి వారు ఐఏఎస్ స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతోపాటు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని ఎన్నికలకు ముందు మాట ఇచ్చామని, ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని కొందుర్గులో రూ.125కోట్లతో 25 ఎకరాల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం శంకుస్ధాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నియోజకవర్గాల్లో సమీకృత గురుకులాలకు శంకుస్థాపనలు చేయగా.. మిగతా చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందుర్గులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు విద్యను దూరం చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. పదేళ్ల పాలనలో 5వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారని గుర్తు చేశారు. పేదలందరూ గొర్రెలు బర్రెలు, పందులు మేపుతూ చేపలు పెంచుకుంటూ బతకాలని కేసీఆర్ భావించారని విమర్శించారు.
చదువుకునే విద్యార్థులను కూడా కులాల వారీగా విభజించారన్నారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ వేర్వేరు గురుకులాలు ఏర్పాటు చేసి.. ఇరుకు గదుల్లో విద్యార్థులను బంధించారని పేర్కొన్నారు. పేద విద్యార్థులు చదువుకుంటే ప్రశ్నిస్తారనే భయంతో.. వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని ఆరోపించారు. 33 జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలను దిగమింగి పార్టీ భవనాలు కట్టుకున్నారు కానీ.. పేద పిల్లలు ఉండే హాస్టళ్లు, గురుకులాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదని దుయ్యబట్టారు. చివరకు ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలూ కల్పించలేదని ధ్వజమెత్తారు. పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్ల మేర అప్పులు చేసిన కేసీఆర్.. పాఠశాలల్లో సదుపాయాల కోసం రూ.10వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు.
సున్నా వచ్చినా.. జ్ఞానోదయం కాలేదు?
పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా.. బీఆర్‌ఎ్‌సకు జ్ఞానోదయం కాలేదని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ‘‘బీఆర్‌ఎస్ వాళ్లకు జ్ఞానోదయం కాకున్నా ఫర్వాలేదు. మా మిత్రుడు మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఏమైందో అర్థం కావడం లేదు. ఆయనంటే నాకు గౌరవం ఉంది. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా నాకు అభ్యంతరం లేదు... పేద విద్యార్థుల కోసం రూ.కోట్లు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తుంటే ఎందుకు తప్పుపడుతున్నారు? పేదలకు విద్య, వైద్యం దూరం చేసిన ఆ దొరల పక్కనే చేరి మమ్మల్ని విమర్శించడం దారుణం. కేసీఆర్ వారసులు రాజ్యాలు ఏలాలి.. వందల కోట్లు దోచుకోవాలి..పేదలు మాత్రం బర్రెలు, గొర్రెలు, పందులు కాసుకోవాలా?’’ అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే 90 రోజుల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని, తాజాగా 11వేలమంది టీచర్లను నియమించామని గుర్తు చేశారు. ‘‘ఎవరితోనైనా చెలగాటం ఆడవచ్చు కానీ.. టీచర్లతో చెలగాటమాడితే కష్టం. టీచర్లు ఏమీ అనరు గానీ.. పోలింగ్ బూత్‌ల్లో వారు చేయాల్సిన పని చేస్తారు’’ అని చలోక్తి విసిరారు.
నేను కూడా రెసిడెన్షియల్ విద్యార్థినే
తాను కూడా రెసిడెన్షియల్ విద్యార్థినేనని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని రెసిడెన్షియల్ స్కూల్లో చదివానని గుర్తు చేసుకున్నారు. వచ్చే రెండేళ్లలో తెలంగాణ విద్యా వ్యవస్థ.. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. తమ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకులం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని విద్యార్థులు మణి తేజ, శృతి పేర్కొన్నారు. సభలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం గొప్ప విషయమంటూ ఆ ఇద్దరు విద్యార్థులను సీఎం అభినందించారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి శనివారం తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లికి రానున్నారు. కుటుంబసభ్యులతో కలిసి దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అలాగే, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
అన్ని వర్గాలు కలిసి మెలసి ఉండేలా..
ఒక్కో సమీకృత గురుకులాన్ని 25 ఎకరాల్లో నిర్మిస్తున్నామని, రూ.125కోట్లు వెచ్చించి సకల సౌకర్యాలు కల్పిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. 2500 మంది విద్యార్థులు ఒకే చోట చదువుకునే విధంగా వీటిని నిర్మిస్తున్నామని చెప్పారు. ఇక్కడ చదువుకునే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎ్‌సలు ఇక్కడ నుంచే రావాలని తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేర్వేరుగా గురుకులాలు ఉంటే వారి మనసుల్లో బాధ ఉంటుంది. మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు.. వేరుగా పెడుతున్నారనుకునే ప్రమాదం ఉంది. అందుకే చిన్నప్పటి నుంచి అందరూ కలిసి మెలిసి ఒకే చోట సోదర భావంతో ఉంటే భవిష్యత్తులో వారి మధ్య కల్మషాలు ఉండవు. అందుకే కులమతాలకు అతీతంగా పిల్లలంతా కలిసి ఉండాలనే సమీకృత గురుకులాలు తెస్తున్నాం’’ అని తెలిపారు.