Share News

Job recruitment: 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు..

ABN , Publish Date - Jul 27 , 2024 | 02:54 AM

రానున్న 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలను నిర్వహించబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 90 రోజుల్లో 31 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం.

Job recruitment: 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు..

  • భర్తీకి పరీక్షలు నిర్వహిస్తాంనిరసనలు, ఆందోళనలు వద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

  • నిరుద్యోగులకు అన్నగా అండగా ఉంటానని హామీ

  • సమస్యలుంటే మంత్రులు, అధికారులకు చెప్పండి

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రానున్న 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలను నిర్వహించబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 90 రోజుల్లో 31 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. డీఎస్సీ నోటిఫికేషన్‌తో 11 వేల టీచర్‌ పోస్టులు, గ్రూప్‌ 1, 2, 3లతోపాటుగా ఇతర శాఖల్లో ఖాళీలు కలిపి దాదాపుగా ఇంకో 30 వేల ఉద్యోగాలకు పోటీ పరీక్షలు నిర్వహిస్తాం. అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు అవుతుంది. తద్వారా మా చిత్తశుద్ధిని నిరూపించుకుని, నిరుద్యోగ యువతకు మా ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించి, ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీనీ జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా భర్తీ చేయాలన్నదే మా లక్ష్యం.’’ అని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులు నిరసనలు, ఆందోళనలకు దిగొద్దని.. రేవంత్‌ అన్నగా వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.


వారికేవైనా సమస్యలు ఉంటే మంత్రులు, అధికారుల్ని కలిసి చర్చించాలన్నారు. వట్టినాగులపల్లిలోని తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 483 మంది ఫైర్‌మెన్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైౖ గౌరవ వందనం స్వీకరించిన సీఎం.. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకమైనదని గుర్తుచేశారు. కానీ రాష్ట్రం ఏర్పాటయ్యాక పదేళ్లపాటు అధికారంలో ఉన్న గత పాలకుల ప్రధాన లక్ష్యాల్లో ఈ అంశం లేకపోవడం దురదృష్టకరమన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోపే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలు తెలంగాణ రాష్ట్ర యువకులకు అందించామని.. ఆ 31 వేలలో ఇక్కడ శిక్షణ పొందిన 483 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారని పేర్కొన్నారు. కఠినమైన శిక్షణ పూర్తి చేసుకుని సమాజానికి తమ వంతు సేవలు అందించడానికి వస్తున్న వారికి అభినందనలు తెలిపారు. ‘‘మీరు తీసుకుంటున్న బాధ్యత ప్రతి నెల మొదటి తారీఖున వచ్చే జీతభత్యాలకోసం కాదు.


జీతభత్యాల కోసం ఎవరూ ప్రాణత్యాగాలకు సిద్ధపడరు. అగ్నిప్రమాదాలు జరిగినా, వరదలు వచ్చినా, అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు.. అందరికంటే ముందు ఉండేది అగ్నిమాపక సిబ్బంది. ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడే బాధ్యత అగ్నిమాపక సిబ్బంది తీసుకుంటారు. సమాజాన్ని కాపాడాలన్న లక్ష్యంతో ఉద్యోగంలో చేరి బాధ్యతలు నిర్వహించేందుకు వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా’’ అని సీఎం వారిని ప్రశంసించారు. కొత్తగా 157 మందికి నియామక పత్రాలు.. శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి ట్రోఫీ, ప్రశంసా పత్రాలు అందించారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా.. విపత్కరమైన, క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకున్నవారి ప్రాణాలను, ఆస్తులను కాపాడే అగ్నిమాపక సిబ్బందిని ప్రశంసించారు. రాష్ట్రంలో పారదర్శకంగా పెద్దఎత్తున నియామకాలు చేపట్టేందుకు టీఎస్పీఎస్సీలో పూర్తిస్థాయి అవగాహన ఉన్న వ్యక్తుల్ని సీఎం నియమించారని.. ఆయన వెల్లడించారు. మున్ముందు జాబ్‌ క్యాలెండర్‌తో మరిన్ని నియామకాలు చేపడతామని మంత్రి వెల్లడించారు.


  • అంబులెన్స్‌లో పంపండి...

కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్‌ ప్రసంగిస్తున్న సమయంలో.. పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ఉన్న ఒక ఫైర్‌మెన్‌ స్పృహ తప్పి కిందపడిపోయాడు. దీన్ని గమనించిన సీఎం.. తన ప్రసంగాన్ని వెంటనే నిలిపివేశారు. అతణ్ని వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాలని అధికారులకు సూచించారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు.


  • సీఎంకు ధన్యవాదాలు: నాగిరెడ్డి

ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే అగ్నిమాపక సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించినందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి ఆ శాఖ డీజీ వై. నాగిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ‘‘అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్‌, డ్రైవర్‌ ఆపరేటర్ల విధులు చాలా ముఖ్యమైనవి. ఈ మధ్యనే సీఎం చొరవ తీసుకుని ప్రతి జిల్లాలో జిల్లా ఫైర్‌ అధికారిని ఏర్పాటుచేశారు. సిబ్బంది వరదలు, అగ్ని ప్రమాదాల్లో ప్రాణలు ప్రణంగా పెట్టి పనిచేస్తారు. కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో గాయపడతారు. మరికొన్ని సందర్భాల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోతారు. అలాంటి పరిస్థితుల్లో వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎక్స్‌ గ్రేషియా పాలసీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది’’ అని ఆయన అన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 02:54 AM