Share News

CM Revanth Reddy: దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించండి

ABN , Publish Date - Aug 22 , 2024 | 03:07 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం మార్గానికి సంబంధించి భూసేకరణను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy: దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించండి

  • ఏమైనా ఇబ్బందులుంటే కేంద్రంతో మాట్లాడండి

  • ఆర్‌ఆర్‌ఆర్‌ పురోగతిపై రోజువారీ సమీక్ష జరపండి

  • సీఎస్‌ శాంతికుమారికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

  • అలైన్‌మెంట్‌లో మార్పులు సూచించిన సీఎం

హైదరాబాద్‌, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం మార్గానికి సంబంధించి భూసేకరణను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని, పనుల్లో జాప్యం లేకుండా ముందుకు సాగాలని అన్నారు. పనుల పురోగతిపై రోజువారీ సమీక్ష జరపాలని, భూసేకరణ, ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తనకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు.


ఈ అంశాలపై కలెక్టర్లు ప్రతి రోజూ సాయంత్రం సీఎ్‌సకు నివేదిక అందించాలన్నారు. బుధవారం సచివాలయంలో ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం భూసేకరణపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సీఎ్‌సతోపాటు మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ఓఎ్‌సడీ షానవాజ్‌ ఖాసీం, ఆయా జిల్లాల కలెక్టర్లు, రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు అందులో పెట్టాలని సూచించారు.


ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ మ్యాప్‌ను పరిశీలించిన సీఎం.. దక్షిణ భాగం అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులను ప్రతిపాదించారు. భవిష్యత్తు అవసరాలే ప్రాతిపదికగా అలైన్‌మెంట్‌ ఉండాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. తాను ప్రతిపాదించిన మార్పులపై క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా అందజేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఫ్యూచర్‌ సిటీకి రేడియల్‌ రోడ్ల నిర్మాణంపైనా సీఎం పలు సూచనలు చేశారు. రేడియల్‌ రోడ్లు ఎక్కడికక్కడ ప్రధాన రహదారులకు, ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు అనుసంధానమయ్యేలా చూడాలని సూచించారు.

Updated Date - Aug 22 , 2024 | 06:40 AM