CM Revanth Reddy: రైతుల శ్రమతోనే వరి సిరి
ABN , Publish Date - Nov 18 , 2024 | 03:31 AM
కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్‌ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం పటాపంచలైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్టుతో సంబంధమే లేకుండా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని పేర్కొన్నారు.
కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డు స్థాయి పంట
బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలు: రేవంత్
హైదరాబాద్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్‌ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం పటాపంచలైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్టుతో సంబంధమే లేకుండా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగిపోయి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకున్నా.. జాతీయ డ్యాం భద్రతా అథారిటీ (ఎన్డీఎ్‌సఏ) సూచన మేరకు అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీటిని నిల్వ చేయకపోయినా.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రికార్డు స్థాయిలో వరిఽ దాన్యం దిగుబడి వచ్చిందని రేవంత్ పేర్కొన్నారు. ఇది తెలంగాణ రైతుల ఘనత అని, వారి శ్రమ, స్వేదం ఫలితమని కొనియాడారు. తెలంగాణ అన్నదాతలు దేశానికే గర్వకారణమని, ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
రైతులకు వెన్నుదన్ను.. ఇదే నిదర్శనం
తెలంగాణ రైతులు 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేేస్త 1.53 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, ఇది రైతాంగం సాధించిన ఘన విజయం అని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మూడు బరాజ్‌లు పనిచేయకున్నా వరి ధాన్యం దిగుబడిలో సాధించిన ఈ రికార్డు ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని పేర్కొన్నారు. ఆదివారం ప్రకటన విడుదల చేసిన ఉత్తమ్.. రైతులకు సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నదనడానికి పండిన పంట నిదర్శనమన్నారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణ వచ్చాక ఈ స్థాయిలో దిగుబడి వచ్చిన సందర్భం లేదన్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాక యావత్ దేశంలోనే ఇదో అరుదైన రికార్డు అని ఉత్తమ్ అభివర్ణించారు. అంకితభావంతో సాగు చేసిన రైతాంగానికి, చేయూత అందించిన వ్యవసాయ, నీటిపారుదల శాఖల సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.