Share News

CM Revanth Reddy: అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

ABN , Publish Date - Aug 20 , 2024 | 03:39 AM

తల్లి ఆత్మహత్యతో అనాథగా మారిన చిన్నారి దుర్గకు సీఎం రేవంత్‌రెడ్డి బాసటగా నిలిచారు. విద్య, వైద్యంతోపాటు ఇతర సౌకర్యాలు అందించాలని నిర్మల్‌ కలెక్టర్‌ అభిలా్‌షకు ఆదేశాలు జారీ చేశారు.

CM Revanth Reddy: అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

  • చిన్నారి దుర్గకు సీఎం రేవంత్‌రెడ్డి భరోసా

  • సాయమందించాలని నిర్మల్‌ కలెక్టర్‌కు ఆదేశాలు

  • ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్‌ ద్వారా రూ.లక్ష: కోమటిరెడ్డి

  • ప్రతినిధి ద్వారా రూ.50వేలు పంపించిన సీతక్క

  • బాలికను ఆదుకుంటామన్న కేంద్ర మంత్రి బండి

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందించిన ప్రభుత్వం

తానూర్‌/హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తల్లి ఆత్మహత్యతో అనాథగా మారిన చిన్నారి దుర్గకు సీఎం రేవంత్‌రెడ్డి బాసటగా నిలిచారు. విద్య, వైద్యంతోపాటు ఇతర సౌకర్యాలు అందించాలని నిర్మల్‌ కలెక్టర్‌ అభిలా్‌షకు ఆదేశాలు జారీ చేశారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని చిన్నారికి తన మాటగా చెప్పాలని సూచించారు. నిర్మల్‌ జిల్లా తానూర్‌ మండలం బేల్‌తరోడాకు చెందిన మేర గంగామణి (36) శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడగా... తల్లి అంత్యక్రియల కోసం డబ్బుల్లేక పదకొండేళ్ల కుమార్తె దుర్గ భిక్షాటన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆమె తండ్రి కూడా గతంలోనే మృతి చెందడంతో ఆ చిన్నారి అనాథగా మారింది.


దీనిపై ‘‘అమ్మ అంత్యక్రియలకు కూతురి భిక్షాటన’’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి.. కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్పందించిన కలెక్టర్‌ అభిలాష్‌.. బాలిక తల్లి అంత్యక్రియల కోసం రూ.10వేలు అందజేశారు. బాలికను గురుకుల పాఠశాలలో చేర్చుతామని, ఇతర సమస్యలేమైనా ఉన్నా వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం బాలికకు అండగా నిలిచారు. ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్‌ ద్వారా రూ.లక్ష సాయాన్ని అందించారు.


ఈ మొత్తాన్ని తానూర్‌ తహసీల్దార్‌ లింగమూర్తి, ఎంపీడీవో అబ్ధుల్‌ సమ్మద్‌, స్థానిక నాయకులు సతీ్‌షరెడ్డి, చిన్నారెడ్డి ద్వారా దుర్గకు అందజేశారు. ఆ తర్వాత వీడియో కాల్‌ ద్వారా బాలికతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. ప్రతి నెలా ఖర్చుల నిమిత్తం రూ.10వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు త్వరలోనే ఇంటిని కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు. దుర్గ ఎంత వరకు చదివితే అంత వరకు చదివిస్తానన్నారు. ముధోల్‌ పర్యటనకు వచ్చినప్పుడు కలుస్తానని బాలికకు మాట ఇచ్చారు.


దుర్గ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క.. వ్యక్తిగతంగా రూ.50వేలు అందజేశారు. మరోవైపు.. బాలికను ఆదుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హామీ ఇచ్చారు. చిన్నారి దుర్గకు ఐక్యత సేవా సమితి సభ్యులు రూ.41వేలు అందజేశారు. బీజేపీ తానూర్‌ మండల అధ్యక్షుడు యాతాళం చిన్నారెడ్డి రూ. 5వేలు అందించారు. ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు, మాజీ ఎమ్మెల్యేలు నారాయణ్‌పటేల్‌, విఠల్‌రెడ్డి తదితరులు బాలికను పరామర్శించారు.

Updated Date - Aug 20 , 2024 | 03:39 AM