Group-1 Exam: చీరకొంగులో చిట్టీలు దాచి దొరికిన మహిళ
ABN , Publish Date - Oct 26 , 2024 | 04:10 AM
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్ వెలుగుచూసింది.
గ్రూప్-1 మెయిన్స్‌లో వెలుగుచూసిన కాపీయింగ్
కాపీయింగ్ చేసింది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలే!
ఇబ్రహీంపట్నం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్ వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మంగల్‌పల్లిలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో శుక్రవారం ఓ మహిళ కాపీయింగ్ చేస్తూ దొరికిపోయింది. చీర కొంగులో చీటీలు పెట్టుకొచ్చి, కాపీయింగ్ చేస్తుండగా పరీక్ష నిర్వహకుడు గమనించి వెంటనే పరీక్ష కేంద్రం చీఫ్ సూపరిండెంటెంట్ శివారెడ్డికి సమాచారమిచ్చారు.
దీంతో ఆమెను పరీక్ష రాయనీయకుండా నిలిపివేసి ఉన్నతాధికారులకు సమాచారమందించారు. అనంతరం చీఫ్ సూపరిండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కాగా, కాపీయింగ్‌కు పాల్పడిన మహిళ వనపర్తి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండటం గమనార్హం. అయితే ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది నేడు వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.