Rural Development: సకల వసతుల ‘పల్లె’
ABN , Publish Date - Jul 05 , 2024 | 03:16 AM
ఊర్లో అన్ని వసతులుంటే ఇబ్బందులన్నీ పోయి ప్రజల జీవితాలు ఆనందమయం అవుతాయి. పిల్లలు చదువుకునేందుకు అన్ని వసతులతో కూడిన చక్కని బడి.. వైద్య సౌకర్యం, తాగునీటి వసతి, అంతర్గత రోడ్లు, చక్కని మురుగు నీటి పారుదల వ్యవస్థ, ఇతర గ్రామాలకు అనుసంధానం చేస్తూ రహదారులు ఉంటే ఎంతో బాగుంటుంది అవునా?
గ్రామాల్లో రోడ్లు, విద్య, వైద్యం, తాగునీరు తదితర వసతులపై ఫోకస్
10,909 గ్రామాల్లో కల్పనకు యోచన
రాష్ట్ర ప్రణాళిక సంఘం సంకల్పం
ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక
సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి వెల్లడి
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఊర్లో అన్ని వసతులుంటే ఇబ్బందులన్నీ పోయి ప్రజల జీవితాలు ఆనందమయం అవుతాయి. పిల్లలు చదువుకునేందుకు అన్ని వసతులతో కూడిన చక్కని బడి.. వైద్య సౌకర్యం, తాగునీటి వసతి, అంతర్గత రోడ్లు, చక్కని మురుగు నీటి పారుదల వ్యవస్థ, ఇతర గ్రామాలకు అనుసంధానం చేస్తూ రహదారులు ఉంటే ఎంతో బాగుంటుంది అవునా? ఈ సౌకర్యాలున్న ఊర్లు కొన్ని ఉండొచ్చు... మరి మిగతా గ్రామాల్లో? కొన్ని ఉంటాయి. ఇంకొన్ని లేవు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కనీస సౌకర్యాలన్నీ కల్పించి.. పల్లెలను ‘సకల వసతులకు కేంద్రం’గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ‘రెవెన్యూ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అన్ని వసతులు కల్పించాలని యోచిస్తోంది. ఏ గ్రామంలో ఏ సౌకర్యాలున్నాయి? ఏవి లేవు? కల్పించాల్సిన సౌకర్యాలేమిటి? అన్న వివరాలను సేకరించాలని ప్రణాళిక సంఘం నిర్ణయించింది.
ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,909 రెవెన్యూ గ్రామాల నుంచి త్వరలోనే వివరాలను సేకరించనుంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి, కార్యరంగంలోకి దిగుతామని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి తెలిపారు. ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి వివరాలు సేకరించి, వాటన్నింటినీ క్రోడీకరించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. సౌకర్యాల కొరత ఉన్న గ్రామాలకు నిధులు కేటాయించాలని ఆ నివేదికలో సర్కారుకు సిఫారసు చేస్తామని చెప్పారు. ఏ ఊర్లోనూ ‘ఫలానా సౌకర్యం లేదు’ అనే మాట వినిపించకూడదన్నదే ప్రభుత్వ ఆలోచన అని వివరించారు. వాస్తవానికి రాష్ట్రంలో కనీస సౌకర్యాలు లేని గ్రామాలు చాలానే ఉన్నాయి. ఒక గ్రామంలో పాఠశాల ఉంటే... సబ్ సెంటర్ ఉండదు. మరో గ్రామంలో పాఠశాల, సబ్ సెంటర్ ఉంటే... రోడ్డు సౌకర్యం, రవాణా సదుపాయం, తాగునీటి వసతి ఉండవు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురికి కంపు కొడుతున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి.
ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా నియమితులయ్యాక ఏదైనా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాలన్న యోచనతో గ్రామాల్లోని సౌకర్యాలపై జి.చిన్నారెడ్డి దృష్టి పెట్టారు. రెవెన్యూ గ్రామాల్లో అక్కడి సర్పంచులు, అభివృద్ధి కమిటీల నుంచి వివరాలు సేకరిస్తామని, వారిచ్చే సమాచారాన్ని క్రోడీకరించి ఆరు నెలల్లోగా నివేదిక తయారు చేస్తామని చెప్పారు. అయితే... ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని, ప్రాథమికంగా ఆయన ఓకే చెప్పారని తెలిపారు.