Share News

Excise Department: లిక్కర్‌ ఐస్‌క్రీమ్‌ ముఠా గుట్టు రట్టు..

ABN , Publish Date - Sep 07 , 2024 | 03:32 AM

ఐస్‌క్రీమ్‌లో లిక్కర్‌ కలిపి చిన్నారులను మత్తుకు అలవాటు చేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్‌ శాఖ పోలీసులు.

Excise Department: లిక్కర్‌ ఐస్‌క్రీమ్‌ ముఠా గుట్టు రట్టు..

  • ఐస్‌క్రీమ్‌లో 100పైపర్స్‌ విస్కీ

  • లిక్కర్‌ ఐస్‌క్రీమ్‌లు విక్రయిస్తున్న ముఠా

  • గుట్టు రట్టు చేసిన ఎక్సైజ్‌ పోలీసులు

  • 11.5కేజీల లిక్కర్‌ ఐస్‌క్రీమ్‌ స్వాధీనం

బంజారాహిల్స్‌/హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 6(ఆంధ్రజ్యోతి): ఐస్‌క్రీమ్‌లో లిక్కర్‌ కలిపి చిన్నారులను మత్తుకు అలవాటు చేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్‌ శాఖ పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 11.5 కేజీల లిక్కర్‌ ఐస్‌క్రీమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆబ్కారీ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఖురేషీ వివరాలు వెల్లడించారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు-1, 5లోని అరికో ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో ఐస్‌క్రీంలో 100 పైపర్స్‌ విస్కి కలిపి అధిక దరలకు అమ్ముతున్నారు.


రకరకాల రుచుల ఐస్‌క్రీమ్‌ గురించి నిర్వాహకులు సోషల్‌ మీడియాలో కూడా ప్రచారం నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ టీం లీడర్‌ ప్రదీ్‌పరావు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. 60 గ్రాముల ఐస్‌క్రీంకు 100 ఎంఎల్‌ విస్కీ కలుపుతున్నట్టు తేలింది. మొత్తం 11.5 కేజీల విస్కీ కలిపిన లిక్కర్‌ ఐస్‌క్రీంను సీజ్‌ చేశారు. రకరకాల రుచుల్లో చిన్న పిల్లలకు ఈ ఐస్‌ క్రీంను అమ్ముతున్నట్లు తేలడంతో పార్లర్‌లో ఉన్న దయాకర్‌రెడ్డి, శోభన్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు. పార్లర్‌ నిర్వాహకుడు శరత్‌చంద్రారెడ్డి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్‌ చేసి లిక్కర్‌ ఐస్‌క్రీమ్‌ తయారీ గుట్టును పూర్తిగా రట్టు చేస్తామన్నారు. నగరంలో ఇలాంటి లిక్కర్‌ ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్న పార్లర్‌లను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్‌ డైరెక్టర్‌ ఖురేషీ తెలిపారు.

Updated Date - Sep 07 , 2024 | 03:32 AM