Share News

NIMS: నిమ్స్‌లో పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు

ABN , Publish Date - Sep 14 , 2024 | 04:27 AM

గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఆర్థిక ఇబ్బందుల వల్ల చికిత్స చేయించలేకపోతున్న వారికి ముఖ్యమైన సమాచారం.

NIMS: నిమ్స్‌లో పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు

  • ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు యూకే వైద్య బృందం ఆధ్వర్యంలో..

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఆర్థిక ఇబ్బందుల వల్ల చికిత్స చేయించలేకపోతున్న వారికి ముఖ్యమైన సమాచారం. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. డాక్టర్‌ రమణ దన్నపనేని ఆధ్వర్యంలోని యూకే వైద్య బృందం తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ వైద్య సేవలను అందించనుంది. ప్రతీ ఏటా వారం రోజులపాటు నిమ్స్‌లో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్న డాక్టర్‌ రమణ దన్నపనేని బృందం ఈ ఏడాది కూడా నిర్వహిస్తుంది.


గుండెకు రంధ్రం, ఇతర గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు ఎవరైనా సరే ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చునని నిమ్స్‌ సంచాలకులు ప్రొఫెసర్‌ నగరి బీరప్ప శుక్రవారం పేర్కొన్నారు. యూకే బృందంతోపాటు నిమ్స్‌ నుంచి కార్డియోథొరాసిక్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ అమరేశ్వరరావు, సీనియర్‌ వైద్యులు గోపాల్‌, ఇతర సిబ్బంది సమన్వయంతో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలి అనుకునే వారు పంజాగుట్ట నిమ్స్‌లోని కార్డియో థొరాసిక్‌ వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Updated Date - Sep 14 , 2024 | 04:27 AM