Share News

Khammam: పదెకరాల పరిమితి.. కౌలురైతుకూ భరోసా

ABN , Publish Date - Jul 11 , 2024 | 02:51 AM

రైతు భరోసా అమలు విధివిధానాలపై రైతుల నుంచి సలహాలు, సూచనల కోసం ఉమ్మడి పది జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన వర్క్‌షాప్‌ కార్యక్రమానికి ప్రభుత్వం కదిలింది. బుధవారం తొలి వర్క్‌షా్‌పను ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించారు.

Khammam: పదెకరాల పరిమితి.. కౌలురైతుకూ భరోసా

  • ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసిన వారికి, రేషన్‌ కార్డు లేనివారికీ ఇవ్వాలి

  • రైతుభరోసా విధివిధానాలపై ఖమ్మం వర్క్‌షాప్‌లో రైతుల సూచనలు

  • అభిప్రాయ సేకరణ జరిపిన మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి

ఖమ్మం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా అమలు విధివిధానాలపై రైతుల నుంచి సలహాలు, సూచనల కోసం ఉమ్మడి పది జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన వర్క్‌షాప్‌ కార్యక్రమానికి ప్రభుత్వం కదిలింది. బుధవారం తొలి వర్క్‌షా్‌పను ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి క్యాబినెట్‌ ఉపసంఘం కన్వీనర్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి విచ్చేసిన రైతులు, రైతు సంఘాల నేతలు, న్యాయవాదులు, వైద్యుల నుంచి మంత్రులు లిఖితపూర్వకంగా అభిప్రాయాలను సేకరించారు. సాగు చేసే ప్రతి రైతుకు సర్వేనంబరు ఆధారంగా రైతుభరోసా ఇవ్వాలని, 10 ఎకరాల పరిమితి పెట్టి రైతులందరికీ అమలుచేయాలని రైతులు సూచించారు. కౌలు రైతులకూ రైతుభరోసా ఇవ్వాలని, పట్టా రైతుకు దక్కే రూ.10వేలలో కౌలు రైతుకు సగం మొత్తం.. అంటే రూ.5వేలు ఇవ్వాలని సూచనలు చేశారు.


విధివిధానాల రూపకల్పనలో తెల్ల రేషన్‌ కార్డు లేనివారికి, ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసిన వారికి పెట్టుబడి సాయం ఇవ్వబోమనే నిబంధన పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. తమ పిల్లల చదువుల కోసం బ్యాంకు రుణాలు పొందేందుకు ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేశామని, అందువల్ల ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసినవారికి కూడా పథకం అమలు చేయాలని సూచించారు. ఏజెన్సీలో భూమి పట్టాలు ఒకరి పేరుపై ఉంటే, సాగులో మరొకరు ఉన్నారని మంత్రుల దృష్టికి తెచ్చారు. ఎప్పుడో పట్టాలు పొంది అమ్ముకున్నవారికే రైతుబంధు, రైతుబీమా, బ్యాంకు రుణాలు, రుణమాఫీ సదుపాయాలు అందుతున్నాయని.. ఏళ్లుగా సాగులో ఉండి పట్టాలు లేకపోవడంతో తమకు పథకాలు దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


దీనివల్ల ఏజెన్సీలో గిరిజనేతర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నా రు. కొందరు వ్యవసాయ ఉత్పత్తులు కాకుండా జామాయిల్‌, సుబాబుల్‌ వంటి తోటలు వేస్తున్నారని అలాంటి రైతులకు రైతుభరోసా మినహాయించాలని సూచించారు. కొందరు కౌలు రైతులు మాట్లాడుతూ.. రైతుభరోసా కూడా తమకు అక్కరలేదని, అయితే కౌలురేట్లు తగ్గించేలా భూ యజమానులను ప్రభుత్వం ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు రైతులు భూములు అమ్ముకున్నా ఇంకా పాసుపుస్తకాల్లో పేర్లు మారడం లేదని, దీంతో ఒకే సర్వేనంబరులో ఒకే భూమికి ఇద్దరు రైతులు రైతుబంధు అందుకుంటున్నారని చెప్పారు.


అసెంబ్లీలో చర్చించాకే విధివిధానాలు: భట్టి

రాష్ట్ర వనరులు, సంపదను ధర్మబద్ధంగా ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వ లక్ష్యమని భట్టివిక్రమార్క పేర్కొన్నారు.. రైతుభరోసా కింద రైతులకు అందించే సాగు సాయం ఎలా అందించాలన్న విషయమ్మీద రైతులనుంచి సలహాలు, సూచనలు తీసుకోవడమే ఈ వర్క్‌షాప్‌ లక్ష్యమన్నారు. అన్ని జిల్లాలో పర్యటించి రైతుల నుంచి వచ్చిన సలహాలు సూచనలపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. ఆ తర్వాతనే విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోగా అభిప్రాయ సేకరణ పూర్తిచేస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుభరోసాపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.


సాగు చేసే వారికే సాయం: తుమ్మల

సాగు చేసే నిజమైన రైతులకే రైతుభరోసా అందించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గతంలో రైతుబంధు పేరుతో సాగులో లేకపోయినా పాసుపుస్తకాల్లో ఉన్న అన్ని రకాల భూములకు రైతుబంధు అందించారని గుర్తు చేశారు.


రైతులను ఆదుకుంటాం: పొంగులేటి

రైతుభరోసా చెల్లింపుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సాగుచేసే రైతులను తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు.

Updated Date - Jul 11 , 2024 | 02:51 AM