Share News

High Court: వీధి కుక్కలను పునరావాస కేంద్రాలకు తరలించండి..

ABN , Publish Date - Aug 03 , 2024 | 05:29 AM

చిన్నపిల్లలు, వృద్ధులపై కుక్కల దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, సంబంధిత స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.

High Court: వీధి కుక్కలను పునరావాస కేంద్రాలకు తరలించండి..

  • ఫిర్యాదుల స్వీకరణకు హెల్ప్‌లైన్‌ ఉండాలి

  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): చిన్నపిల్లలు, వృద్ధులపై కుక్కల దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, సంబంధిత స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీచేసింది. యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఏబీసీ) రూల్స్‌ ప్రకారం కుక్కల జననాలను తగ్గించాల్సి ఉందని తెలిపింది. నగరం బయట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. కుక్కల బెడదపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి స్థానిక అథారిటీలు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొంది.


ఏబీసీ రూల్స్‌లోని 10, 11, 15, 16 నిబంధనలు అమలు చేసి అమలు నివేదికను సమర్పించాలని పేర్కొంది. కుక్కల దాడులపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన పిటిషన్‌తోపాటు ఇదే అంశంపై దాఖలైన పలు పిటిషన్‌లపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఆదేశాల మేరకు యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ ఇంప్లిమెంటేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీని జీవో 315 ద్వారా ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

Updated Date - Aug 03 , 2024 | 05:29 AM