Share News

Allu Arjun: 6 వరకు తదుపరి చర్యలేమీ వద్దు

ABN , Publish Date - Oct 26 , 2024 | 04:49 AM

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సినీనటుడు అల్లు అర్జున్‌, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.

Allu Arjun: 6 వరకు తదుపరి చర్యలేమీ వద్దు

  • అల్లు అర్జున్‌ పిటిషన్‌పై అప్పుడు నిర్ణయం వెల్లడిస్తాం: హైకోర్టు

  • అది కోడ్‌ ఉల్లంఘన కాదు: అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది

అమరావతి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సినీనటుడు అల్లు అర్జున్‌, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో నవంబర్‌ 6న నిర్ణయం వెల్లడిస్తామని న్యాయస్థానం ప్రకటించింది. అప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా తదుపరి చర్యలు అన్నింటినీ నిలుపుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల కోడ్‌ ఉల్లఘించారంటూ నంద్యాల టూటౌన్‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్‌, కిశోర్‌రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున న్యాయవాది వై.నాగిరెడ్డి వాదనలు వినిపించారు.


అల్లు అర్జున్‌ పర్యటన పూర్తి వ్యక్తిగతమని, స్నేహం కారణంగానే కిశోర్‌రెడ్డిని అభినందించేందుకు ఈ ఏడాది మే11న నంద్యాల వెళ్లారని చెప్పారు. అల్లు అర్జున్‌ వచ్చాడని తెలిసి ఆయన ఫ్యాన్స్‌ కిశోర్‌రెడ్డి ఇంటివద్దకు వచ్చారన్నారు. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాదని, పిటిషనర్లపై డిప్యూటీ తహశీల్దార్‌ ఇచ్చిన ఫిర్యాదు చెల్లుబాటు కాదన్నారు. పోలీసుల తరఫున అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ స్పందిస్తూ.. కేసులో పోలీసులు ఇప్పటికే ఛార్జిషీట్‌ దాఖలు చేశారన్నారు. దీనిని ట్రయల్‌ కోర్టు ఇంకా నంబర్‌ కేటాయించలేదన్నారు.


ఈ దశలో న్యాయమూర్తి స్పందిస్తూ..ట్రయల్‌ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన తరువాత సంబంధిత కేసును క్వాష్‌ చేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేయవచ్చా అని సందేహం వ్యక్తం చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది నాగిరెడ్డి స్పందిస్తూ.. ట్రయల్‌ కోర్టు ఛార్జిషీట్‌ను కాగ్నిజెన్స్‌లోకి తీసుకోలేదన్నారు. క్వాష్‌ పిటిషన్‌పై నిర్ణయం వెల్లడించేవరకు నంద్యాల పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా తదుపరి చర్యలన్నింటినీ నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. ప్రస్తుత పిటిషన్‌ పై నవంబర్‌ 6న నిర్ణయం వెల్లడిస్తామన్నారు.

Updated Date - Oct 26 , 2024 | 04:49 AM