Share News

Hyderabad: 18,942 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు..

ABN , Publish Date - Jun 28 , 2024 | 03:04 AM

తెలంగాణలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ), భాషా పండితులు (ఎల్పీ), వ్యాయామ విద్య ఉపాధ్యాయుల (పీఈటీ)కు పదోన్నతులు లభించాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు దక్కినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Hyderabad: 18,942 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు..

  • ఎస్జీటీలు, పండితులు, పీఈటీలకు..

  • 20 ఏళ్ల నిరీక్షణకు తెర.. టీచర్ల హర్షం

  • ముఖ్యమంత్రి రేవంత్‌కు కృతజ్ఞతలు

  • ఎస్జీటీలు, పండితులు, పీఈటీలకు ప్రమోషన్లు

  • ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయుల హర్షం

  • సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపిన టీచర్లు

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ), భాషా పండితులు (ఎల్పీ), వ్యాయామ విద్య ఉపాధ్యాయుల (పీఈటీ)కు పదోన్నతులు లభించాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు దక్కినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి సర్కారు సముచిత రీతిలో వ్యవహరించిందని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అర్హులైన వేలాది మంది పదోన్నతులకు నోచుకోలేదని, తమ 20 ఏళ్ల కల నెరవేరిందని పేర్కొంటున్నారు.


విద్యా శాఖ కూడా సీఎం వద్దే ఉండడంతో పదోన్నతుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడిందంటున్నారు. చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు మార్గం సుగమమైందని చెబుతున్నారు. తమ అర్హతకు తగినట్లు పదోన్నతులు దక్కడంతో ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యా శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


జోన్ల వారీగా పదోన్నతులు

మల్టీ జోన్‌ 1లో ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 10,083 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. అలాగే మల్టీ జోన్‌ 2లో ఎస్జీటీల నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా స్థానిక సంస్థల స్కూళ్లలో 5,962 మందికి, మల్టీ జోన్‌ 2 పరిధిలో ప్రభుత్వ బడుల్లో 1,027 మందికి పదోన్నతులు దక్కాయి. అలాగే మల్టీ జోన్‌ 2 పరిధిలో స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా స్థానిక సంస్థల పాఠశాలల్లో 776 మందికి, మల్టీ జోన్‌ 1లో స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా స్థానిక సంస్థల బడుల్లో 995 మందికి, మల్టీ జోన్‌ 1లో ప్రభుత్వ స్కూళ్లలోని 99 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి.

Updated Date - Jun 28 , 2024 | 03:04 AM