Share News

HYD : మల్లారెడ్డి వర్సిటీకి శ్రీముఖం

ABN , Publish Date - Sep 18 , 2024 | 05:12 AM

డీమ్డ్‌ యూనివర్సిటీగా మారిన మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌ బయటపడింది. కాళోజీ హెల్త్‌ వర్సిటీ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) తీసుకోకుండానే యూజీసీ నుంచి డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా తెచ్చుకున్నట్లు వైద్యశాఖ గుర్తించింది.

HYD : మల్లారెడ్డి వర్సిటీకి శ్రీముఖం

  • నేడో, రేపో నోటీసులు ఇవ్వనున్న సర్కారు

  • ఎన్‌వోసీ లేకుండానే డీమ్డ్‌ హోదా

  • దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం

  • హైకోర్టునూ ఆశ్రయించే ఆలోచన

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): డీమ్డ్‌ యూనివర్సిటీగా మారిన మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌ బయటపడింది. కాళోజీ హెల్త్‌ వర్సిటీ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) తీసుకోకుండానే యూజీసీ నుంచి డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా తెచ్చుకున్నట్లు వైద్యశాఖ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందున ఆ డీమ్డ్‌ వర్సిటీకి నోటీసులకు పంపేందుకు రంగం సిద్ధమయింది. నేడో రేపో ఆ యూనివర్సిటీకి సర్కారు నుంచి శ్రీముఖం వెళ్లే అవకాశం ఉంది. వైద్యవిద్య ప్రవేశాలు ప్రారంభమయ్యాక డీమ్డ్‌ హోదా తెచ్చుకోవడంతో రాష్ట్ర విద్యార్ధులకు దక్కాల్సిన 320 ఎంబీబీఎస్‌ సీట్లకు ఎసరుపడింది. దీనిపై కూడా హైకోర్టును ఆశ్రయించే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. మల్లారెడ్డి డీమ్డ్‌ యూనివర్సిటీ వ్యవహారంపై బుధవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆ శాఖ ఉన్నతాధిఽకారులతో సమీక్ష నిర్వహించనున్నారు. వాస్తవానికి మెడికల్‌ కాలేజీలకు యూజీసీకి అసలు సంబంధం ఉండదని, అనుమతులు, పర్యవేక్షణ వ్యవహారాలన్ని జాతీయ వైద్య మండలినే చూస్తుందని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఏదైనా మెడికల్‌ కాలేజీ డీమ్డ్‌ హోదా కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆ కాలేజీ అప్పటికే అనుబంధంగా ఉన్న హెల్త్‌ యూనివర్సిటీ నుంచి ఎన్‌వోసీ తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ మల్లారెడ్డి కాలేజీలకు అసలు తాము ఎన్‌వోసీ ఇవ్వలేదని, ఎన్‌వోసీ లేకుండానే డీమ్డ్‌ హోదా తెచ్చుకున్నారని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.

  • డీమ్డ్‌లకు అడ్డుకట్ట..

మరోవైపు డీమ్డ్‌ యూనివర్సిటీల పేరిట ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు గండి కొట్టే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డీమ్డ్‌, ప్రైవేటు యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్‌ కాలేజీలైనా సగం సీట్లను కన్వీనర్‌ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకు రావాలని యోచిస్తోంది. ఈ అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని వైద్యవిద్య సంచాలకులు, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులను ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

Updated Date - Sep 18 , 2024 | 05:12 AM