Share News

Hyderabad : టీజీఎస్‌ ఆర్టీసీలో 3,035 కొలువులు

ABN , Publish Date - Jul 03 , 2024 | 04:52 AM

టీజీఎస్‌ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి అడుగు పడింది. వివిధ విభాగాల్లో మొత్తం 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతినిచ్చింది.

Hyderabad : టీజీఎస్‌ ఆర్టీసీలో 3,035 కొలువులు

  • ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ఆమోదం

  • త్వరలో నోటిఫికేషన్‌: మంత్రి పొన్నం

  • వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ఆమోదం

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): టీజీఎస్‌ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి అడుగు పడింది. వివిధ విభాగాల్లో మొత్తం 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతినిచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలోనే వెలువడనుంది. సుమారు పదేళ్లుగా ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు జరగడం లేదు. దీంతో వివిధ విభాగాల్లో వేలాది మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసినా ఆ ఖాళీలు భర్తీ కాలేదు. దీంతో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి.

ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోయింది. గత ప్రభుత్వం హయాంలో సంస్థ మనుగుడే ప్రశ్నార్థకం అయింది. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారనే చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన మహాలక్ష్మీ పథకంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు అమాంతం పెరిగింది. సంస్థ ఆదాయం కూడా వృద్ధి చెందింది. రూ.13కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు ఉండే రోజువారీ ఆదాయం రూ.20 కోట్ల నుంచి రూ.22 కోట్లకు చేరింది. ఫలితంగా ఆర్టీసీ ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కిందని భావిస్తున్నారు.


అయితే, ఆర్టీసీలోని వివిఽధ విభాగాల్లో సుమారు పది వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ అత్యవసంగా 3,035 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్‌-743, డిప్యూటీ సూపరింటెండెంట్‌(మెకానిక్‌)- 114, డిప్యూటీ సూపరింటెండెంట్‌(ట్రాఫిక్‌)- 84, డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌- 25, అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌)- 23, అసిస్టెంట్‌ మెకానికల్‌ ఇంజినీర్‌-15, సెక్షన్‌ ఆఫీసర్‌(సివిల్‌)-11, మెడికల్‌ ఆఫీసర్‌(జనరల్‌)- 07, అకౌంట్స్‌ ఆఫీసర్‌ 06, మెడికల్‌ ఆఫీసర్‌-7, మెడికల్‌ ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌)-7 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

కాగా, ఆర్టీసీలో కొత్త రక్తం నింపేందుకే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని నిర్ణయించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆయా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలోనే వెలువడుతుందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఆ బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు.

Updated Date - Jul 03 , 2024 | 04:54 AM