Share News

Hyderabad: హై.. హై.. ‘హైడ్రా’!

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:27 AM

జీహెచ్‌ఎంసీతో పాటు ఔటర్‌ వరకు పరిధి.. దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్లు.. 27 మునిసిపాలిటీలు, 33 పంచాయతీలు..! స్వయంప్రతిపత్తితో విధి నిర్వహణతో.. హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) పేరిట మహా నగరంలో కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

Hyderabad: హై.. హై.. ‘హైడ్రా’!

  • జీహెచ్‌ఎంసీతో పాటు ఔటర్‌ వరకు పరిధి

  • 27 మునిసిపాలిటీలు, 33 పంచాయతీలు

  • జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ నుంచి నిధులు

  • సంస్థ కమిషనర్‌కు పూర్తి అధికారాలు

  • చెరువులు, సర్కారీ స్థలాలపైన పర్యవేక్షణ

  • అక్రమ నిర్మాణాల నియంత్రణకు చర్యలు

  • త్వరలో కొలిక్కిరానున్న విధి విధానాలు

హైదరాబాద్‌ సిటీ, జూలై 4(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీతో పాటు ఔటర్‌ వరకు పరిధి.. దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్లు.. 27 మునిసిపాలిటీలు, 33 పంచాయతీలు..! స్వయంప్రతిపత్తితో విధి నిర్వహణతో.. హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) పేరిట మహా నగరంలో కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ నుంచి నిధులతో ఇది విధులు నిర్వర్తించనుంది. చెరువుల కబ్జాలకు అడ్డుకట్ట.. సర్కారీ స్థలాల పరిరక్షణ.. అక్రమ నిర్మాణాల నియంత్రణ.. ఆయా ప్రభుత్వ విభాగాల పనితీరులో జవాబుదారీతనం పెంపు.. విపత్తుల నిర్వహణను పర్యవేక్షించనుంది. ఈ మేరకు హైడ్రా ఏర్పాటుకు ప్రభుత్వం సాగిస్తున్న కసరత్తు త్వరలో కొలిక్కిరానుంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్న హైడ్రాపై వారం, పది రోజుల్లో స్పష్టమైన విధివిధానాలు విడుదలవుతాయని, ఉత్తర్వులూ జారీ అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. జీహెచ్‌ఎంసీతో పాటు ఔటర్‌ వరకు ఉన్న ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి వస్తాయంటూ దాని బాధ్యతలు, విధులను ఇటీవల ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం సూత్రప్రాయంగా వివరించినట్లు సమాచారం.


వివిధ విభాగాలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడంపై ఆయన ప్రత్యేక దృష్టిసారించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలోని మునిసిపాలిటీలు/కార్పొరేషన్లు, పంచాయతీలను హైడ్రా కిందకు తీసుకురానున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు వచ్చే ఆదాయంలో కొంత హైడ్రాకు ఇచ్చేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీలో భాగంగా ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తూ..సరికొత్త బాధ్యతలతో హైడ్రాను తీసుకొస్తున్నారు. సంస్థ కమిషనర్‌గా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ) స్థాయి అధికారి ఏవీ రంగనాథ్‌ను నియమించారు. కూల్చివేతలు, అధికారులపై చర్యలు, ఇతర అంశాలకు సంబంధించి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి కమిషర్‌ రిపోర్ట్‌ చేస్తారు. కాగా, సంస్థ అవసరాలకు సంబంధించిన వ్యయంపై కమిషనర్‌ స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది. 2 వేల చదరపు కిలోమీటర్ల మేర పనిచేయాల్సి ఉన్నందున హైడ్రాను సంస్థాగతంగా బలోపేతం చేయనున్నారు.


చెరువుల వద్ద సీసీ కెమెరాలతో నిఘా

  • చెరువుల కబ్జాలపై వచ్చే ఫిర్యాదుల మీద హైడ్రా తక్షణమే స్పందిస్తుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఆక్రమణలు నిర్ధారణ అయితే కూల్చివేతలు చేపడతారు. నిబంధనలకు విరుద్ధంగా.. చెరువుల ఫుల్‌ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌జోన్‌లో నిర్మించిన భవనాలనూ నేలమట్టం చేస్తారు. చెరువుల వద్ద సీసీ కెమెరాలు లేదా సిబ్బందిని నియమించి నిఘా ఉంచనున్నారు.

  • ప్రభుత్వ స్థలాలు, పార్కుల ఆక్రమణలపైనా ఉక్కుపాదం మోపనున్నారు. ఆక్రమణలు తేలితే ప్రస్తుతం విధించే శిక్షను పెంచే విషయాన్నీ పరిశీలిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎ్‌స) ప్రకారం చట్ట సవరణపై నిర్ణయం తీసుకునేలా నివేదిస్తారు.


  • సిబ్బంది గుర్తించిన, ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన అక్రమ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనుమతి లేకుండా నిర్మించినా.. అనుమతి తీసుకున్న అంతస్తుల కంటే ఎక్కువ నిర్మాణం చేపట్టినా జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ ప్రకారం నోటీసులిచ్చి కూల్చివేయనున్నారు. ప్రస్తుతం జోన్‌కు ఒకటి చొప్పున స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, ఈవీడీఎం పరిధిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది ఉన్నా అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అలసత్వం కనబరుస్తున్నారు. ఇకమీదట కూల్చివేతల విషయంలో హైడ్రా రంగంలోకి దిగనుంది. అనుమతుల జారీలో అక్రమాలు జరిగినా అధికారులను బాధ్యులను చేయనున్నారు.

  • నాలాల పూడికతీత, వరద నిర్వహణ, రోడ్ల నిర్మాణం, మరమ్మతు వంటి పనులనూ విజిలెన్స్‌ అధికారులు పరిశీలిస్తారు. పనులు జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తారు. తదనుగుణంగా సంబంధిత అధికారులపై చర్యలుంటాయి. వాటర్‌బోర్డు చేపట్టే పనులపైనా హైడ్రా పరిశీలన ఉంటుంది.


  • హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గించేలా పోలీసులతో సమన్వయం చేసుకుంటారు. ప్రధాన రహదారుల పక్కన ఫుట్‌పాత్‌లపై శాశ్వత ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టిసారించనున్నారు.

  • వరద నిర్వహణకు జీహెచ్‌ఎంసీ, వాటర్‌ బోర్డు, ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాటు చేసిన బృందాలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయా? లేదా? వరద ఎంతసేపు రోడ్లపై ఉంటోంది? క్యాచ్‌ పిట్ల వద్ద సిబ్బంది వ్యర్థాలు తొలగిస్తున్నారా..? అనేది గమనిస్తారు. ఎక్కువ సమయం వరద రోడ్లపై నిలిచిన పక్షంలో ఆ ప్రాంత అధికారి జవాబుదారీగా వ్యహరించాల్సి ఉంటుంది.

Updated Date - Jul 05 , 2024 | 04:27 AM