Share News

Group-1 Exams: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం

ABN , Publish Date - Oct 21 , 2024 | 01:36 PM

ఎన్నో ఉద్రిక్తతల నడుమ ఎట్టకేలకు తెలంగాణ గ్రూప్- 1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. జీవో 29 రద్దు చేయాలని, మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కొన్ని రోజులుగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలతో హైదరాబాద్ నగరాన్ని హోరెత్తించారు.

Group-1 Exams: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం
Group-1 Exams

హైదరాబాద్: ఎన్నో ఉద్రిక్తతల నడుమ ఎట్టకేలకు తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్- 1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా మధ్యాహ్నం 2గంటలకు పరీక్ష ప్రారంభమైంది. 1.30గంటలలోపై అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. జీవో 29 రద్దు చేయాలని, మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కొన్ని రోజులుగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలతో హైదరాబాద్ నగరాన్ని హోరెత్తించారు. తమకు అన్యాయం జరుగుతుందంటూ రోడ్డెక్కారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు సైతం వారికి మద్దతు తెలిపి ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నారు. లాఠీ ఛార్జీలు, అరెస్టులు, కోర్టు కేసుల నడుమ తెలంగాణ సర్కార్ చివరికి పరీక్షలు నిర్వహించేందుకే మెుగ్గు చూపింది. హైకోర్టు, సుప్రీంకోర్టులు సైతం చివరి నిమిషంలో పరీక్షలు రద్దు చేయడం కుదరదంటూ తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.


గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ్టి నుంచి ఈనెల 27వ తేదీ వరకూ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు మెుత్తం 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెుత్తం 563 పోస్టులు ఉండగా.. 31,383 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీజీపీఎస్సీ అభ్యర్థులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. రోజుకో హాల్‌టికెట్‌తో అభ్యర్థులు రావొద్దని తెలిపింది. తొలి రోజు పరీక్ష కేంద్రానికి తెచ్చిన హాల్‌టికెట్‌నే మిగిలిన రోజులూ తమ వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేసింది.


సుప్రీంకోర్టు తీర్పు హర్షనీయం..

మరోవైపు గ్రూప్- 1 పరీక్షలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయలేమన్న సుప్రీంకోర్టు తీర్పు హర్షనీయమని మహేశ్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. " తెలంగాణ యువతకు మంచి ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలను హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్థించాయి. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో విద్యార్థులు హ్యాపీగా పరీక్షలు రాసుకోండి. 13 ఏళ్ల తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింది. దాన్ని ఉపయోగించుకొని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.


అభ్యర్థులను రెచ్చగొట్టారు..

మేము మొదటి నుంచి గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉన్నాం. ఇదే విషయాన్ని పదే పదే చెపుతూనే ఉన్నాం. జీవో 29 వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగదని మరోసారి చెప్తున్నా. నేను బీసీ బిడ్డగా అభ్యర్థులకు భరోసా ఇస్తున్నా. రిజర్వేషన్లు పొందే వారికి ఎలాంటి అన్యాయం జరగదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వారి రాజకీయ లబ్ధి కోసం గ్రూప్-1 అభ్యర్థులను పావుగా వాడుకున్నాయి. మీరు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి భవిష్యత్ పొందాలని కోరుకుంటున్నా. పరీక్షలు రాస్తున్న అందరికీ శుభాకాంక్షలు.. అభినందనలు" అని చెప్పారు.

Updated Date - Oct 21 , 2024 | 03:05 PM