Share News

Hyderabad: సై‘కిల్‌ ’ ట్రాక్‌.. బెంబేలేత్తుతున్న జనం..!

ABN , Publish Date - May 28 , 2024 | 04:15 PM

ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, ఆనందానికి నెలవుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట ఏర్పాటు చేసిన సోలార్‌ రూఫ్‌టాప్‌ సైకిల్‌ ట్రాక్‌పై సైక్లింగ్‌ అంటే బెంబేలేత్తుతున్నారు సైక్లిస్టులు.

Hyderabad: సై‘కిల్‌ ’ ట్రాక్‌.. బెంబేలేత్తుతున్న జనం..!

  • సైక్లింగ్‌ అంటేనే జంకుతున్న సైక్లిస్టులు

  • ‘ఔటర్‌ వెంట ట్రాక్‌పైకి దూసుకొస్తున్న వాహనాలు

  • ఆరు నెలల్లోనే పదికిపైగా ప్రమాదాలు

  • సర్వీసు రోడ్డులో కరువైన వేగ నియంత్రణ

  • ధ్వంసమవుతున్న సోలార్‌ రూఫ్‌టాప్‌

  • చర్యలు చేపట్టాలంటున్న సైక్లిస్టులు, స్థానికులు

హైదరాబాద్‌ సిటీ, మే 28(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, ఆనందానికి నెలవుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట ఏర్పాటు చేసిన సోలార్‌ రూఫ్‌టాప్‌ సైకిల్‌ ట్రాక్‌పై సైక్లింగ్‌ అంటే బెంబేలేత్తుతున్నారు సైక్లిస్టులు. ఈ ట్రాక్‌ అందుబాటులోకి వచ్చిన ఆరు నెలల్లో ఇప్పటి వరకు పదికి పైగా ప్రమాదాలు జరడమే ఇందుకు కారణం. ఔటర్‌పై వేగంగా వస్తున్న కార్లు, ట్రక్కులు అదుపుతప్పి సైకిల్‌ ట్రాక్‌లోకి దూసుకొస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రూఫ్‌టాప్‌ కూడా పెద్దఎత్తున దెబ్బతింటోంది. దీని పునరుద్ధరణ కూడా హెచ్‌ఎండీఏ-హెచ్‌జీసీఎల్‌ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఇలా జరుగుతున్న వరుస ప్రమాదాలతో ఈ ట్రాక్‌పై సైక్లింగ్‌ చేసే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది.

పెరిగిన వాహనాల సంఖ్య

నగరానికి పశ్చిమాన ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట నార్సింగి, కోకాపేట, పుప్పాలగూడ, నానక్‌రాంగూడ, కొల్లూరు తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున బహుళ అంతస్తుల భవనాలు, విల్లా ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. జన సామర్థ్యం పెరగడంతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరిగాయి. ఈ క్రమంలోనే ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట నానాక్‌రాంగూడ నుంచి టీఎ్‌సపీఏ జంక్షన్‌ వరకు, మరో వైపు టీఎ్‌సపీఏ నుంచి కొల్లూరు వరకు సర్వీసు రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించారు. అలాగే సైక్లిస్టుల కోసం ప్రత్యేకంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట నానక్‌రాంగూడ నుంచి టీఎ్‌సపీఏ వరకు, అటు కొల్లూరు వరకు ప్రత్యేకంగా సోలార్‌ రూఫ్‌టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ను ఔటర్‌ రింగ్‌ రోడ్డు, సర్వీసు రోడ్డు మధ్యలో వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. వాహనాలు సైకిల్‌ ట్రాక్‌పైకి రాకుండా అడుగున్నర ఎత్తుతో కాంక్రిట్‌ డివైడర్‌ను నిర్మించారు. అయినా వాహనాలు అతివేగంతో కాంక్రీట్‌ డివైడర్‌ను దాటుకొని సైకిల్‌ ట్రాక్‌పైకి దూసుకొస్తున్నాయి.

వరుస ప్రమాదాలతో..

సైకిల్‌ ట్రాక్‌ను ప్రారంభించిన పది రోజులకే ఓ కారు ట్రాక్‌లోకి దూసుకొచ్చింది. ఆ సమయంలో ట్రాక్‌పై సైక్లిస్టులు ఎవరూ లేరు. ఆ తర్వాత రోజు రాత్రి సమయంలో సైకిల్‌ ట్రాక్‌లోకి ఏకంగా ఓ టిప్పర్‌ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో సుమారు 50మీటర్ల మేర సోలార్‌ రూఫ్‌ పూర్తిగా దెబ్బతిన్నది. సైకిల్‌ ట్రాక్‌, అక్కడున్న చెట్లు సైతం ధ్వంసమయ్యాయి. ఆ సమయంలోనూ ట్రాక్‌పై సైకిలిస్టులు ఎవరూ లేరు. దాంతో ప్రాణపాయం తప్పింది. వారం రోజుల క్రితం నార్సింగి పోలీసు స్టేషన్‌ సమీపంలో మరో టిప్పర్‌ అత్యంత వేగంగా ట్రాక్‌పైకి దూసుకొచ్చింది. ఈ విధంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట గల 21 కిలోమీటర్ల సైకిల్‌ ట్రాక్‌లో ఎక్కడో చోట వాహనాలు దూసుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు పదికిపైగా ప్రమాదాలు జరిగిన్నట్లు అధికారులు గుర్తించారు. కానీ ఎక్కడ కూడా సైక్లిస్టులకు ప్రమాదం జరగలేదు.

వేగ నియంత్రణ కరువు

ఔటర్‌పై గరిష్ట వేగం 120 కిలోమీటర్లు.. ఈ వేగానికి మించి వాహనాలు ప్రయాణం చేస్తే జరిమానా విధిస్తారు. కానీ ఔటర్‌ సర్వీసు రోడ్డులో మాత్రం వేగ నియంత్రణ లేదు. దాంతో సర్వీస్‌ రోడ్డులో వాహనదారులు రెచ్చిపోతూ మితీమిరిన వేగంతో నడుపుతున్నారు. దీంతో వాహనాలు అదుపుతప్పి సైకిల్‌ ట్రాక్‌లో దూసుకొస్తున్నాయి. వీకెండ్‌లలోనే ఈ ప్రమాదాలు అధికంగా అవుతున్నాయి. ఔటర్‌పై ప్రమాదాలు జరగకుండా రోడ్డుకిరువైపులా 158కి.మీ మేర బారికేడ్లను ఏర్పాటు చేశారు. అదే తరహాలో సైకిల్‌ ట్రాక్‌కు ఓ వైపు బారికేడ్లు ఏర్పాటు చేస్తే వాహనాలు ట్రాక్‌పైకి రావడానికి అవకాశముండదు. వరుస ప్రమాదాల దృష్ట్యా సైక్లిస్టులు ట్రాక్‌ వద్దకు రాకుండా తమ కాలనీ, అపార్ట్‌మెంట్‌ ఆవరణకే పరిమితమవుతున్నారు. ఔటర్‌ సర్వీసు రోడ్డులో వాహనాల వేగాన్ని నియంత్రించాలని, ట్రాక్‌పైకి వాహనాలు దూసుకురాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సైక్లిస్టులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - May 28 , 2024 | 04:59 PM