GHMC: జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో ఉద్రిక్తత.. కొట్టుకున్న కార్పొరేటర్లు
ABN , Publish Date - Jul 06 , 2024 | 01:31 PM
జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకరినొకరు కార్పొరేటర్లు కొట్టుకున్నారు.. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది..
హైదరాబాద్: జీహెచ్ఎంసీ (GHMC) కౌన్సిల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం సమావేశం ప్రారంభమైనప్పట్నుంచీ టెన్షన్ వాతావరణమే నెలకొంది. అనుకున్నట్లుగానే కార్పొరేటర్లు ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్.. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. దీంతో కౌన్సిల్‌లో పరిస్థితులు అదుపులో లేకుండా పోయాయి. ప్లకార్డులు చూపించుకున్న అంశంపై మొదలైన ఈ గొడవ.. కొట్టుకునే పరిస్థితికి వెళ్లింది. కౌన్సిల్‌ను కంట్రోల్ చేయలేక.. ఉద్రిక్త పరిస్థితుల మధ్యే సభ నుంచి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెళ్లిపోయారు. ఇవాళ ఉదయం నుంచి కౌన్సిల్ రచ్చ రచ్చగానే సాగింది.!
ఆందోళన..
ఈ దాడి ఘటనపై కౌన్సిల్ హాల్‌లోనే బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనలకు దిగారు. తమ కార్పొరేటర్లపై దాడి చేసిన ఎంఐఎం కార్పొరేటర్లు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పోడియం ముందు కూర్చుని బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కౌన్సిల్ హాల్ లోపల భారీగా మార్షల్స్ మోహరించారు. అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు.. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎవరూ తగ్గట్లేదని తెలుస్తోంది. ప్లకార్డులు చూపించడం మొదలుకుని గొడవ, ఆందోళన వరకూ వారిని నిలువరించే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిందని సమాచారం.
సారీ.. సారీ..!
ఈ గొడవకు ముందు.. కలుషిత నీటిపై కౌన్సిల్‌లో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. దీంతో.. తమ డివిజన్‌లో కూడా కలుషిత నీరు వస్తోందని మేయర్ విజయలక్ష్మి చెప్పారు. అయితే.. ఈ కౌన్సిల్‌కు జలమండలి ఎండీ హాజరుకాలేదు. దీంతో ఆ ఎండీపై కార్పొరేటర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ మీటింగ్ నుంచే జలమండలి ఎండీతో అశోక్ రెడ్డితో మేయర్ ఫోన్‌లో మాట్లాడారు. జ్వరం కారణంగా తాను కౌన్సిల్ సమావేశానికి.. హాజరుకాలేకపోతున్నట్లు వాటర్ బోర్డ్ ఎండీ వివరణ ఇచ్చుకున్నారు. జలమండలి ఎండీని కౌన్సిల్ మీటింగ్‌కు రావాలని మేయర్ కోరారు. అయితే.. ఈ వ్యవహారంపై కలుగజేసుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి.. కార్పొరేటర్లకు సారీ చెప్పారు. దీంతో కార్పొరేటర్లు కాస్త శాంతించారు..!
నిరవధిక వాయిదా..
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కొట్లాటతో మొదలై.. గొడవతోనే ముగిసింది. సమస్యలపై చర్చించకుండానే అర్ధాంతరంగానే కౌన్సిల్ ముగిసింది. కౌన్సిల్ సమావేశాలను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల కొట్లాటతో కౌన్సిల్ వాయిదా పడింది.