Share News

Hyderabad Police: డీజేలతో ఇబ్బందులు.. త్వరలోనే ఆంక్షలు..

ABN , Publish Date - Sep 26 , 2024 | 04:06 PM

డీజేల నియంత్రణపై హైదరాబాద్ పోలీసులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వినియోగంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు..

Hyderabad Police: డీజేలతో ఇబ్బందులు.. త్వరలోనే ఆంక్షలు..
DJ Sounds

ఏవైనా పండుగలు.. ఉత్సవాలు.. ర్యాలీలు అంటే వెంటనే గుర్తొచ్చేది డీజే.. ప్రస్తుతం డీజే ఓ ట్రెండ్‌గా మారింది. డీజే లేకపోతే ఫుల్ బోర్.. ఓ వైపు డీజే పేరుతో పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి డ్యాన్స్ చేయడం దాదాపు అన్ని ర్యాలీల్లో చూస్తున్నాం. ఈ డీజే సౌండ్స్‌పై పలు ఫిర్యాదులు వస్తున్నాయి. పెద్ద పెద్ద సౌండ్స్‌తో ఇబ్బందులు పడుతున్నట్లు నగర వాసులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో డీజేల నియంత్రణపై హైదరాబాద్ పోలీసులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వినియోగంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మత సంఘాల ప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులతో పాటు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రాపాలీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఎంఐఎం ఎమ్మెల్యేలు, మత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Madhavilatha: శ్రీవారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా మాధవీలత ఏం చేశారంటే..


డీజే శబ్దాలపై ఫిర్యాదులు..

డీజే శబ్దాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సౌండ్స్‌తో నివాసాల్లో వయసు మీరిన వారు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొందరు గుండె అదురుతుందని ఆందోళన చెందుతున్నారని, డీజే సౌండ్స్ శృతి మించుతున్నాయన్నారు. కేవలం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగానే కాకుండా మిలాద్ ఉన్ నబి వేడుకల్లోనూ డీజే నృత్యాలు విపరీతమయ్యాయని చెప్పారు. పండుగలు, ఉత్సవాలు లేదా ఏదైనా ర్యాలీల్లో డీజేలు ఎక్కువుగా వాడుతున్నారని తెలిపారు. పబ్‌లో డ్యాన్సులు చేసినట్లే ర్యాలీల్లో చేస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు. డీజే శబ్దాలను కట్టడి చేయాలని వివిధ సంఘాల నుంచి వినతులు వచ్చాయని తెలిపారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ మత సంఘాల ప్రతినిధులను పిలిచి వారి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. అందరి అభిప్రాయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని, ఆ తర్వాత ప్రభుత్వం డీజేలపై ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. డీజే శబ్దాలపై నియంత్రణ లేకపోతే ఆరోగ్యాలు దెబ్బతింటాయన్నారు.

Kollu Ravindra: నోటికొచ్చినట్లు వాగితే.. పళ్లురాలిపోతాయ్.. జాగ్రత్త అంటూ పేర్నినానిపై ఫైర్


డీజేలపై ఆంక్షలు పెడతారా..

మితిమీరిన సౌండ్స్‌తో డీజేల వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం డీజేలపై పలు ఆంక్షలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీజేలు పెట్టడానికి సమయాలను నిర్దేశించడంతో పాటు, సౌండ్ పర్సంటేజీపై ఆంక్షలు పెట్టడంతో పాటు.. ఏయే సందర్భాల్లో డీజే వినియోగించాలి, ఏ సందర్భాల్లో డీజేలు ఉపయోగించకూడదనే దానిపై మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఏయే ప్రదేశాల్లో డీజేను అనుమతించాలి. ఏ ప్రదేశాల్లో అనుమతించకూడదనే విషయంలోనూ ప్రభుత్వం కొన్ని గైడ్‌లైన్స్ రూపొందించనుందనే చర్చ జరగుతోంది. పోలీసు అధికారుల నివేదిక తర్వాత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది.


AP Govt: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి షోకాజ్ నోటీస్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 26 , 2024 | 04:53 PM