Share News

HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 20 , 2024 | 02:24 PM

గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువుదీరింది. అయితే మూసీ నది పరివాహక ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.

HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, అక్టోబర్ 20: అనుమతులున్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేయబోదని ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. చట్టబద్దమైన అనుమతులతో నిర్మాణాలు చేపట్టిన వారెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలను సైతం కూల్చివేస్తామంటూ ప్రచారం జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. అనుమతులున్న నిర్మాణాలను కూల్చివేయమని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని చెప్పారు. సీఎం ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంటుందని ఏవీ.రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.


గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువుదీరింది. అయితే మూసీ నది పరివాహక ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. అందులోభాగంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ను నియమించింది. అలాగే ఈ హైడ్రాకు చట్టబద్దతను కూడా కల్పించింది.


హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అయితే హైడ్రా కూల్చివేతలపై కొంతమంది సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లింది. మరోవైపు హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలసిందే.


అలాగే హైడ్రా కారణంగా మరింత మంది ఇళ్లు కోల్పోవాల్సి వస్తుందంటూ ఓ ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజల్లో ఓ విధమైన భయాందోళన నెలకొంది. ఇక ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఆరోపణలను అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండించారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ సైతం రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు.


తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో హైడ్రాకు ప్రత్యేక కార్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే కార్యాలయానికి సిబ్బందిని సైతం కేటాయించింది. అలాగే పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో కీలక ఉన్నతాధికారులను నైతం ఈ హైడ్రాలో విధులు కేటాయించింది.

For Telangana News And Telugu News...

Updated Date - Oct 20 , 2024 | 02:40 PM