Share News

MP Kavya: కేంద్ర బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్యానికి అరకొర కేటాయింపులు

ABN , Publish Date - Aug 02 , 2024 | 09:17 PM

వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య (MP Kadiam Kavya) పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంకెల గారడి చేస్తూ పబ్బం గడుపుతోందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య పద్దులపై శుక్రవారం పార్లమెంట్‌లో కాంగ్రెస్ పక్షాన ఎంపీ డాక్టర్ కడియం కావ్య చర్చలో పాల్గొన్నారు.

MP Kavya:  కేంద్ర బడ్జెట్‌లో  వైద్య, ఆరోగ్యానికి అరకొర కేటాయింపులు
MP Kadiam Kavya

ఢిల్లీ: వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య (MP Kadiam Kavya) లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో అంకెల గారడి చేస్తూ పబ్బం గడుపుతోందని విమర్శించారు. బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య పద్దులపై శుక్రవారం పార్లమెంట్‌లో కాంగ్రెస్ పక్షాన ఎంపీ కావ్య చర్చలో పాల్గొన్నారు. ఆయుష్మాన్ భారత్ పేరిట నెలకొల్పిన పథకం పేదల ఆయుష్షు పెరిగేందుకు ఉపయోగపడట్లేదని, అరకొర నిధులతో పేదలను ఆరోగ్యవంతులను చేసేలా లేవని కావ్య అభిప్రాయపడ్డారు.

కేంద్రం కోవిడ్ మేనేజ్మెంట్‌లో అనూహ్య విజయం సాధించిందని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం సాధారణ ఆరోగ్య రంగంలో చేస్తుంది ఏం లేదని కావ్య ఎద్దేవ చేశారు. వైద్య, ఆరోగ్య సేవలను విస్తరింపజేయాలని బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు అరకొరగా ఉన్నాయని.. వీటి విషయంలో వైద్య ఆరోగ్యశాఖ సరైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ప్రధానమని ఈ విషయంలో మరింత వ్యూహాత్మకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


కేన్సర్‌పై చర్చ..

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బాలికల ప్రధాన సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధిని కొనియాడుతూ గతంలో తెలంగాణలో కూడా మెనుస్ట్రవల్ హైజీన్ విషయంలో కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన చర్యలను ఉదాహరించారు. కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల విషయంలో పేదల కుటుంబాలు ఇళ్లు గుల్లా అవుతాయని, వారి ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని కేన్సర్ నిర్ధారక పరీక్షలు మొదలుకొని నివారణ వరకు చేపట్టే చర్యల్లో రాయితీలు కల్పించాలని కావ్య సూచించారు. నీట్ పరీక్షపై ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి మోదీ లీకేజీ యోజన రూపంలో కూడా పథకాలు వస్తాయేమోనని వ్యంగంగా అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు కేటాయిస్తుందని స్పష్టం చేశారు.


వరంగల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి..

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయిలో 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు కడియం కావ్య వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ వైద్య మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.323 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యాన్ని ప్రధాన అంశంగా పరిగణిస్తూ వ్యక్తి ఆరోగ్యమే దేశ ఆరోగ్యానికి ఉపకరిస్తుందని ఆ దిశగా నిధులు విడుదల చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. కాజీపేట కేంద్రంగా గల రైల్వే జంక్షన్ 54 రైల్వే స్టేషన్లకు న్యూక్లియస్‌గా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇక్కడి రైల్వే ఉద్యోగులకు ప్రస్తుతం ఇక్కడ ఉన్న హాస్పిటల్ ద్వారా అందుతున్న సేవలు పరిమితంగా ఉన్నాయని ఎంపీ డాక్టర్ కావ్య తెలిపారు. ఉద్యోగుల అవసరాల రీత్యా CGHS వెల్ నెస్ సెంటర్ వరంగల్లో నెలకొల్పాలని వైద్య ఆరోగ్య మంత్రిని కోరారు. నిన్న ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. వర్గీకరణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పార్లమెంట్లో డాక్టర్ కడియం కావ్య ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Aug 02 , 2024 | 09:34 PM