Share News

Manam Chocolates: ‘టైమ్‌’ జాబితాలో మన ‘మనం చాక్లెట్‌’

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:38 AM

‘‘స్విస్‌ చాక్లెట్‌ లేదంటే బెల్జియన్‌ చాక్లెట్స్‌ మాత్రమే అత్యుత్తమం’’ అని చాలామంది అనుకుంటారు! కానీ.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా రైతులు పండించిన కోకోతో ప్రపంచం మెచ్చే చాక్లెట్‌లను రూపొందించి సంచలనం సృష్టించిన హైదరాబాదీ ‘మనం చాక్లెట్స్‌’ సంస్థ ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి పొందింది.

Manam Chocolates: ‘టైమ్‌’ జాబితాలో మన ‘మనం చాక్లెట్‌’

  • వరల్డ్స్‌గ్రేటెస్ట్‌ ప్లేసెస్‌ చిట్టాలో స్థానం

  • దేశం నుంచి ఎంపికైన రెండింటిలో ఒకటి

  • పశ్చిమ గోదావరిలో పండించిన కోకోతో హైదరాబాద్‌లో చాక్లెట్లు

హైదరాబాద్‌ సిటీ, జూలై 26(ఆంధ్రజ్యోతి): ‘‘స్విస్‌ చాక్లెట్‌ లేదంటే బెల్జియన్‌ చాక్లెట్స్‌ మాత్రమే అత్యుత్తమం’’ అని చాలామంది అనుకుంటారు! కానీ.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా రైతులు పండించిన కోకోతో ప్రపంచం మెచ్చే చాక్లెట్‌లను రూపొందించి సంచలనం సృష్టించిన హైదరాబాదీ ‘మనం చాక్లెట్స్‌’ సంస్థ ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. సుప్రసిద్ధ టైమ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన వార్షిక ‘వరల్డ్స్‌ గ్రేటెస్ట్‌ ప్లేసెస్‌’ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ‘మనం చాక్లెట్‌’తో పాటు భారతదేశం నుంచి ఈ ఏడాది ఈ జాబితాలో చోటు సాధించింది.. హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘నార్‌ రెస్టారెంట్‌’ మాత్రమే కావడం విశేషం.


వివిధ రంగాలలో తమదైన ప్రత్యేకతను చాటుతూ వైవిధ్యంగా నిలిచిన హోటల్స్‌, క్రూయిజెస్‌, రెస్టారెంట్లు, ఆకర్షణలు, మ్యూజియంలు, పార్క్‌ల వంటి వాటితో ఈ జాబితాను టైమ్‌ మ్యాగజైన్‌ ఏటా విడుదల చేస్తుంటుంది. అలా ఈ ఏడాది చూడాల్సిన 100 అసాధారణ ప్రాంతాలలో ఒకటిగా బంజారాహిల్స్‌లోని మనం చాక్లెట్‌ ఖార్ఖానాను పేర్కొంది. చాక్లెట్‌ ప్రేమికుల స్వర్గధామంగా పేరొందిన ఈ ఖార్ఖానాలో.. చాక్లెట్‌ రుచులను ఆస్వాదించడంతో పాటుగా కోకో గింజలను చాక్లెట్‌గా మార్చేప క్రియ్ర మొత్తాన్నీ ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. రకరకాల రుచుల చాక్లెట్లను ఆస్వాదించవచ్చు. వాటిని తయారుచేసే సిబ్బందితో మాట్లాడవచ్చు. కోకో, చాక్లెట్‌ గురించి తెలియని విషయాలెన్నో ఇక్కడ తెలుసుకోవచ్చన్నది రెగ్యులర్‌గా ఈ సెంటర్‌కు వెళ్లేవారి మాట.


ఇక్కడ దాదాపు 50కి పైగా విభాగాలలో 300కు పైగా రకాల చాక్లెట్‌లు ఉంటాయని ‘మనం చాక్లెట్‌’ వ్యవస్ధాపకుడు చైతన్య మప్పాల తెలిపారు. ‘‘ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చాక్లెట్‌ అండ్‌ కోకో టెస్టింగ్‌’’ నుంచి చాక్లెట్‌ టెస్టింగ్‌లో లెవల్‌ 1, 2 3 సర్టిఫికెట్లను పొందిన ఆయన.. ఇండియాలో ఏకైక లెవల్‌ 3 సర్టిఫైడ్‌ చాక్లెట్‌ టేస్టర్‌గా గుర్తింపు పొందారు. క్రాఫ్ట్‌ చాక్లెట్‌ అనుభవాలను భారతీయులకు అందించాలనే లక్ష్యంతో గత సంవత్సరమే ‘మనం చాక్లెట్‌’ను ప్రారంభించామని చైతన్య చెప్పారు. ఇప్పుడు తమకు ఈ గౌరవం దక్కడం ఆనందం కలిగిస్తోందని పేర్కొన్నారు. కాగా.. యూకేకు చెందిన అకాడమీ ఆఫ్‌ చాక్లెట్‌ అవార్డులలో ఒక గోల్డ్‌, 10 సిల్వర్‌, 5 కాంస్య పతకాలతో సహా 17 అవార్డులను ఈ బ్రాండ్‌ గత ఏడాది అందుకోవడం మరో విశేషం. అంతేకాదు బ్రాండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ విభాగంలో ఓవరాల్‌ విన్నర్‌గా కూడా ‘మనం చాక్లెట్‌’ నిలిచింది.

Updated Date - Jul 27 , 2024 | 04:38 AM