Share News

మేం ఇక్కడే ఉంటాం!

ABN , Publish Date - Oct 15 , 2024 | 03:23 AM

ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా చేపట్టిన క్యాడర్‌ కేటాయింపుల ప్రకారం.. ఏపీ, తెలంగాణకు కేటాయించిన అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు.

మేం ఇక్కడే ఉంటాం!

5.jpg

  • మళ్లీ క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు

  • డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులు సవాల్‌

  • తెలంగాణలోనే ఉంటామన్న ఆమ్రపాలి,

  • వాకాటి కరుణ, వాణీప్రసాద్‌, రొనాల్డ్‌రోస్‌

  • ఏపీలోనే ఉంటానంటూ సృజన పిటిషన్లు

  • నేడు విచారణ.. క్యాట్‌ నిర్ణయంపై ఉత్కంఠ

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా చేపట్టిన క్యాడర్‌ కేటాయింపుల ప్రకారం.. ఏపీ, తెలంగాణకు కేటాయించిన అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ఏ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు అదే రాష్ట్రానికి వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రిలీవింగ్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పలువురు ఐఏఎస్‌ అధికారులు మళ్లీ సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (క్యాట్‌) హైదరాబాద్‌ను ఆశ్రయించారు. తాము ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రంలోనే ఉంటామని, కేంద్రం ఇచ్చిన అస్పష్ట ఆదేశాల (నాన్‌ స్పీకింగ్‌ ఆర్డర్‌)ను కొట్టేయాలని కోరారు. ఈ మేరకు కాట ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్‌, గుమ్మడి సృజన, రొనాల్డ్‌రోస్‌.. క్యాట్‌లో వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. వీరిలో సృజనను తెలంగాణకు కేటాయించగా.. ప్రస్తుతం ఆమె ఏపీలో పనిచేస్తున్నారు.


మిగిలిన నలుగురిని ఏపీకి కేటాయించగా.. వారు తెలంగాణలో పనిచేస్తున్నారు. వీరి పిటిషన్లు మంగళవారం లతా బస్వరాజ్‌ పాట్నే, శాలినీ మిశ్రా బెంచ్‌ ఎదుట విచారణకు రానున్నాయి. ఉమ్మడి ఏపీ విభజనకు ముందు కొత్తగా ఏర్పడబోయే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల విభజనకు 2014లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యూష్‌ సిన్హా కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇరు రాష్ట్రాలకు అధికారులను కేటాయించింది. అయితే ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ.. గతంలో తెలంగాణ సీఎ్‌సగా పనిచేసిన సోమేశ్‌కుమార్‌, డీజీపీగా పనిచేసిన అంజనీకుమార్‌ సహా 15 మంది అధికారులు అప్పట్లో క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్‌ సదరు అధికారులకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడంతో అప్పటి నుంచి వారు కేంద్ర కేటాయింపులకు విరుద్ధంగా తెలంగాణ, ఏపీలో కొనసాగుతున్నారు.


  • కేంద్రం నిర్ణయమే అంతిమం..!

క్యాట్‌ ఉత్తర్వులపై డీవోపీటీ (కేంద్రం) హైకోర్టును ఆశ్రయించగా.. అప్పటి చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ తెలంగాణ సీఎ్‌సగా ఉన్న సోమేశ్‌కుమార్‌ కేసును మొదటి కేసుగా తీసుకుని తీర్పు ఇచ్చారు. సోమేశ్‌కుమార్‌ ఏపీకి వెళ్లాలని, కేంద్రం నిర్ణయమే అంతిమమని తీర్పులో స్పష్టం చేశారు. ఆ తర్వాత మిగతా కేసుల్లో.. కేసుల వారీగా ప్రత్యేక అంశాలు, సమస్యలు ఇమిడి ఉన్నాయని అధికారులు పేర్కొనడంతో అవన్నీ జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి ఽనేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌కు బదిలీ అయ్యాయి. వాటిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి ద్విసభ్య ధర్మాసనం.. అధికారులు తమ సమస్యలను వివరిస్తూ కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


కేసుల వారీగా వాటిని పరిశీలించి కేంద్రం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ పిటిషన్‌లను ముగించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో అధికారులు.. తమ కేసులను పరిశీలించాలని, తాము ఇక్కడే ఉంటామని పేర్కొంటూ కేంద్రానికి వినతిపత్రాలు అందజేశారు. అయితే వారి విజ్ఞప్తులను కొట్టేస్తూ కేంద్రం తాజాగా ఈ నెల 9న ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడి అధికారులు అక్కడికే వెళ్లిపోవాలని, తొలుత కేటాయించిన రాష్ట్రాల్లోనే ఈ నెల 16న రిపోర్ట్‌ చేయాలని స్పష్టం చేసింది.


  • కేంద్రం ఆదేశాలను కొట్టేయాలి..!

తాము ఇన్నేళ్లుగా పనిచేసిన రాష్ట్రాన్ని వదిలేసి కొత్త రాష్ట్రంలో రిపోర్ట్‌ చేయాలని కేంద్రం పేర్కొనడం సరికాదని, క్యాడర్‌ విభజనలో పలు లోపాలు ఉన్నాయంటూ ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్‌, సృజన, రొనాల్డ్‌రోస్‌.. క్యాట్‌లో వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఒక్కో అధికారి కేసును ప్రత్యేకంగా పరిశీలించి స్పష్టమైన ఆర్డర్‌ ఇవ్వాలని హైకోర్టు పేర్కొన్నప్పటికీ.. కేంద్రం నాన్‌ స్పీకింగ్‌ ఆర్డర్‌ ఇచ్చిందని తెలిపారు. ఈ ఆదేశాలను కొట్టేయడం ద్వారా తాము ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.


అయితే మంగళవారం జరగనున్న విచారణలో అధికారులకు అనుకూలంగా క్యాట్‌ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తేనే వారు తెలంగాణలో కొనసాగుతారు. లేదంటే వారంతా తమకు కేటాయించిన రాష్ట్రానికి వెళ్లిపోవాల్సి వస్తుంది. దీంతో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మరికొందరు అధికారులు కూడా క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Oct 15 , 2024 | 03:23 AM