IIT Graduates: ఆర్ అండ్ బీలోకి ఐఐటియన్లు..
ABN , Publish Date - Sep 09 , 2024 | 04:13 AM
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో ఐఐటీ పట్టభద్రులు ఉద్యోగులుగా చేరనున్నారు.
ఏఈఈలుగా ఎంపికైన వారిలో ఐదుగురు ఐఐటీ పట్టభద్రులు
నిట్, బిట్స్, ఐఐఐటీల నుంచీ.. హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు
ఉద్యోగాల్లో ఎంతమంది కొనసాగుతారన్న సందేహాలు
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో ఐఐటీ పట్టభద్రులు ఉద్యోగులుగా చేరనున్నారు. క్షేత్రస్థాయిలో పని చేసే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టులకు ఎంపికైన 143 మందిలో పలువురు ఐఐటీ, నిట్, ఐఐఐటీ, బిట్స్ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకున్న వారున్నారు. ఐఐటీల నుంచి ఐదుగురు, నిట్‌ల నుంచి 13 మంది, బిట్స్ పిలానీ నుంచి ఒకరు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)ల నుంచి 8 మంది, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 30 మంది, జేఎన్‌టీయూ నుంచి 16 మంది ఉండగా, తెలంగాణలోని వివిధ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివిన వారు మరికొందరున్నారు.
ఇలా ప్రఖ్యాత సంస్థల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులు వచ్చి చేరుతుండటంపై ఆర్‌అండ్‌బీ శాఖలో హర్షం వ్యక్తమవుతోంది. వీరికి క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉండటంతో పాటు కొత్త టెక్నాలజీలను ఉపయోగించి పనులను త్వరితగతిన పూర్తి చేయటంపైనా అవగాహన ఉంటుందని శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ సానుకూల అంశం ఉన్నప్పటికీ.. ఉన్నత విద్యాసంస్థల నుంచి వచ్చిన వీరిలో ఎందరు ఏఈఈ ఉద్యోగంలో కొనసాగుతారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఐఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐటీల్లో చదివిన విద్యార్థులకు.. ప్రైవేటు రంగంలో మంచి వేతనాలతో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయి. దీంతో ఎంపికైన వారిలో ఎందరు ఉద్యోగాల్లో కొనసాగుతారు అన్నది కూడా చర్చనీయాంశమైంది. కాగా, ప్రస్తుతం ఎంపికైన వారిలో మల్టీజోన్-1లో పురుషులు 53 మంది, మహిళలు 18 మంది (మొత్తం 71మంది), మల్టీజోన్-2లో పురుషులు 52 మంది, మహిళలు 18 మంది (మొత్తం 70మంది) ఉన్నారు.