Share News

Hyderabad: గంజాయి బ్యాచ్‌.. బాలికపై గ్యాంగ్‌ రేప్‌..

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:41 AM

ఫోన్‌ ద్వారా పరిచయమైన బాలికను గంజాయి మత్తులోకి దింపిన ఓ యువకుడు, తన స్నేహితులతో కలిసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం బయటపడింది. కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

Hyderabad: గంజాయి బ్యాచ్‌.. బాలికపై గ్యాంగ్‌ రేప్‌..

  • కూలీ పనులకు తల్లి.. ఇంట్లో ఆమె ఒక్కతే

  • తొలుత ఫోన్‌ ద్వారా పరిచయమైన ఓ యువకుడు

  • తర్వాత మరో నలుగురు.. వీరి ద్వారా ఆమె గంజాయి మత్తులోకి

  • పలుమార్లు సామూహిక అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి

  • కాచిగూడలో ఘటన.. ఐదుగురిపై పోక్సో కేసు.. అందరూ పరారీలో

బర్కత్‌పుర జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ద్వారా పరిచయమైన బాలికను గంజాయి మత్తులోకి దింపిన ఓ యువకుడు, తన స్నేహితులతో కలిసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం బయటపడింది. కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఒక మహిళ తన 15 ఏళ్ల కూతురుతో కలిసి కాచిగూడ పరిధిలో నివాసం ఉంటూ రోజూ కూలీ పనులకు వెళుతోంది. బాలిక ఆరో తరగతి దాకా చదువుకొని, బడి మానేసి ఇంటి వద్దే ఉంటోంది.


తల్లి కూలీ పనులకు వెళ్లాక దగ్గర్లో ఉండే ఓ అమ్మాయి ఇంటికి బాలిక వెళ్లేది. అక్కడ ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఒకరోజు బాలిక నుంచి అమ్మాయి సెల్‌ఫోన్‌ తీసుకొని, తనకు పరిచయం ఉన్న విజయ్‌ కుమార్‌ (23) అనే యువకుడితో మాట్లాడింది. ఈ క్రమంలో ఓసారి అతడు ఆ నంబరుకే ఫోన్‌ చేయగా ఈ బాలికే మాట్లాడటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది క్రమంతప్పకుండా రోజూ మాట్లాడుకునే దాకా వెళ్లింది. పగలంతా ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండటంతో అతనొచ్చి ఆమెను బైక్‌పై ఎక్కించుకొని తానుండే నేరెడ్‌మెట్‌కు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో తన స్నేహితులైన బాలు (25), కృష్ణ (25), కిరణ్‌ (24), అజయ్‌ (25)లకు బాలికను పరిచయం చేశాడు.


అప్పటికే గంజాయికి అలవాటు పడిన ఈ యువకులు, బాలికను కూడా ఆ మత్తులోకి దించారు. ఈ క్రమంలో విజయ్‌, అతడి స్నేహితులు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురవడంతో వైద్య పరీక్షలు చేయించగా గర్భిణి అని తేలింది. బాధితురాలిని తల్లి నిలదీయడంతో జరిగిన ఘోరమంతా ఆమెకు చెప్పింది. బాలికను వెంటబెట్టుకొని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదుగురు నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఐదుగురూ పరారీలోనే ఉన్నారు.

Updated Date - Jun 25 , 2024 | 03:41 AM