Share News

Kaleshwaram: నీటి నిల్వతోనే బ్యారేజీ కుంగింది..

ABN , Publish Date - Sep 29 , 2024 | 04:22 AM

‘‘బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమే కట్టాలి. కానీ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేస్తే తప్ప మోటార్లు అన్నీ నడిపే పరిస్థితుల్లేవు.

Kaleshwaram: నీటి నిల్వతోనే బ్యారేజీ కుంగింది..

  • నిల్వ చేస్తే తప్ప బ్యారేజీలు నడిచే పరిస్థితి లేదు.. సరిపడా వరద వెళ్లేలా బ్యారేజీని డిజైన్‌ చేయలేదు

  • ఘోష్‌ కమిషన్‌ విచారణలో రామగుండం మాజీ ఈఎన్సీ

  • మార్పులకు వ్యాప్కోస్‌ ఆమోదంపై దాటవేత

  • తప్పుదోవ పట్టించడంపై ఘోష్‌ ఆగ్రహం

  • రెండు విడతలుగా క్రాస్‌ ఎగ్జామినేషన్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘‘బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమే కట్టాలి. కానీ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేస్తే తప్ప మోటార్లు అన్నీ నడిపే పరిస్థితుల్లేవు. బ్యారేజీలో నీటి నిల్వతో ఒత్తిడి పెరిగింది. దాంతో, పునాది(రాఫ్ట్‌) కింద నుంచి ఇసుక జారింది. ఈ కారణం వల్లే ఏడో బ్లాకు కుంగింది. సరిపడా వరద వెళ్లేలా బ్యారేజీని డిజైన్‌ చేయకపోవడం ఒక కారణం. గేట్ల ఆపరేటింగ్‌ షెడ్యూల్‌ను పాటించకపోవడం, వరద ప్రవాహ వేగాన్ని సరిగ్గా అంచనా వేయకపోవడంతో సీసీ బ్లాకులు చెల్లాచెదురై, స్టోన్‌ లాంచింగ్‌ ఆఫ్రాన్లు దెబ్బతిన్నాయి’’ అని జస్టిస్‌ పినాకీ చంద్ర ఘోష్‌ కమిషన్‌ విచారణలో రామగుండం మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.


విచారణలో భాగంగా కాళేశ్వరం కమిషన్‌ శనివారం ఆయనకు 71 ప్రశ్నలను సంధించింది. సమాధానాలు పరిపూర్ణంగా లేవని, రికార్డులు సమర్పించాలని, అవసరమైతే మళ్లీ విచారణకు హాజరు కావ డానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. దాంతో, రికార్డులతో హాజరుకావడానికి అవకాశం ఇవ్వాలని నల్లా వెంకటేశ్వర్లు విజ్ఙప్తి చేశారు. సాంకేతిక అంశాల్లో తమకంటే ఎక్కువ పరిజ్ఞానం ఉందన్న కారణంతో కమిషన్‌ను గంద రగోళంలోకి నెట్టే ప్రయత్నాలు వీడాలని హితవు పలికింది. ఒక దశలో బుక్‌లెట్‌ తెచ్చుకొని అందులో నుంచి సమాధానాలు చెబుతుండగా.. కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిషన్‌కు సమర్పించిన పత్రాల్లోని వివరాల ఆధారంగానే జవాబు ఇవ్వాలని, ప్రత్యేకంగా పత్రాలు తెచ్చుకొని జవాబులు చెప్పడం కమిషన్‌ను పక్కదారి పట్టించడమే అవుతుందని ఆక్షేపించింది.


రాఫ్ట్‌, పియర్‌, గేట్ల సైజుల విషయంలో డీవియేషన్స్‌ జరిగాయని, వ్యాప్కోస్‌ తన డీపీఆర్‌లో ఫ్లడ్‌ బ్యాంకుల ప్రస్తావన పెట్టలేదని, అందుకే అంచనాలను సవరించాల్సి వచ్చిందని తెలిపారు. డిజైన్లు, డ్రాయింగ్‌లకు ఐబీఎం కమిటీ తుదిరూపు ఇచ్చిందని చెప్పారు. విచారణ జరిగిన తీరు ఇలా..షీట్‌ పైల్స్‌ బదులు సీకెంట్‌ పైల్స్‌ వాడేందుకు అనుమతి ఎవరిచ్చారు? జియో టెక్నికల్‌ పరీక్షల కోసం బోర్లు వేస్తున్న సమయంలో ఆ ప్రదేశం షీట్‌ పైల్స్‌కు అనువుగా లేదని గుర్తించాం. డీపీఆర్‌లో జడ్‌ ఆకృతి రకం షీట్‌ పైల్స్‌ వినియోగించాలని ఉంది.


ఎన్‌ఐటీ వరంగల్‌, ఐఐటీ మద్రాసు మాజీ ప్రొఫెసర్లతో నివేదికలు తెప్పించుకొని సీఈ-సీడీవోకు ఇచ్చాం. టెక్నోఎకనామికల్‌ కారణాలతో సీకెంట్‌ పైల్స్‌ వాడటానికి వీలుగా సీఈ సీడీవో రిపోర్టు ఇచ్చారు. మేడిగడ్డలో బ్లాక్‌-1, 2లలో సీకెంట్‌ పైల్స్‌, ఆర్‌సీసీ కటా్‌ఫలు వాడాలని; బ్లాక్‌-3 నుంచి 8 దాకా సీకెంట్‌ పైల్స్‌ వాడాలని సీఈ సీడీవో సిఫారసు చేశారు. నిర్మాణంలో ఏ పైల్స్‌ వాడాలో సీఈ సీడీవో చెబుతుందా? ఆ నిర్ణయం నిర్మాణ బాధ్యతలు చూసే అధికారులదా?జియో టెక్నికల్‌ నివేదికల ఆధారంగా ‘తగిన పైల్స్‌’ వాడాలని సీఈ-సీడీవో సిఫారసు చేశారు.మీ వాదనకు ఆధారమేంటి? ప్రామాణిక రికార్డులను అందించగలరా?


జియో టెక్నికల్‌, జియో ఫిజికల్‌ నివేదికల ఆధారంగానే సీఈ సీడీవో ఆ సిఫారసు చేసింది.

తగిన రుజువులు, అధీకృత పత్రాలు లేకుండా తప్పుడు వివరాలు చెబుతారా? (కమిషన్‌ ఆగ్రహం)

జవాబులు ఇచ్చే విషయంలో ఇంగ్లీషుపై పట్టు లేకపోవడం వల్లే తప్పు జరిగింది

ఆంగ్లంపై పట్టు లేకున్నా మీరు చీఫ్‌ ఇంజనీర్‌గా పని చేశారా? కమిషన్‌ కన్నా మీకు సాంకేతిక పరిజ్ఙానం ఎక్కువ ఉండొచ్చు. అలాగని, కమిషన్‌నే పక్కదోవ పట్టిస్తారా? (ఆగ్రహం)

కమిషన్‌ను తప్పుదోవ పట్టించలేదు. రెండు, మూడు రోజుల్లో తగిన పత్రాలు ఇస్తాను.


  • వెంట్‌ (నీళ్లు వెళ్లే ద్వారాలు)ల్లో మార్పులు జరిగాయా?

మేడిగడ్డ, అన్నారంలలో ఎన్ని వెంట్‌లు ఉండాలో సీఈ సీడీవో సిఫారసు చేశారు. సుందిళ్లలో 68వెంట్‌లు ఉండాలని చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్‌ ల్యాబోరేటరీ ఆధ్వర్యంలో 2డీ నమూనా అధ్యయనాల అనంతరం అదనంగా 6 వెంట్‌లను ప్రతిపాదించాం.

  • వ్యాప్కో్‌సకు డీపీఆర్‌ తయారీ బాధ్యతలు ఎవరిచ్చారు? పత్రాలు ఉన్నాయా?

బెల్లంపల్లి ఎస్‌ఈ ఆదేశాలతో డీపీఆర్‌ తయారీకి వ్యాప్కో్‌సకు ఆదేశాలు ఇచ్చారు. 2016 జనవరి 17న సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో డీపీఆర్‌ను సమర్పించారు. బ్యారేజీని మార్చాలని వ్యాప్కోస్‌ సూచించింది. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌పై ప్రభుత్వం హైపవర్‌ కమిటీని వేసింది. ఆ కమిటీ సిఫారసులతో కొత్త బ్యారేజీల నిర్మాణం నిర్ణయం తీసుకున్నారు.


  • ప్రభుత్వం నిర్దేశించకుండా వ్యాప్కోస్‌ నిర్ణయం తీసుకోదు. హైపవర్‌ కమిటీ బాధ్యతలేంటి?

ప్రాణహిత-చేవెళ్ల, కాంతనపల్లి ప్రాజెక్టులతో ముడిపడిన సమస్యలపై హై పవర్‌ కమిటీని ప్రభుత్వం వేసింది. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌లో భాగంగానే హై పవర్‌ కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సిఫారసు చేసింది. అటవీ భూమి సేకరణ తగ్గించడం, ముంపు సమస్యను తగ్గించడం, విద్యుత్తు వినియోగం కుదించడం వంటి అంశాల ఆధారంగా బ్యారేజీల స్థలాల మార్పుపై నిర్ణయం తీసుకున్నారు.

  • మార్పులకు వ్యాప్కోస్‌ ఆమోదం ఉందా?

హైపవర్‌ కమిటీ సమావేశానికి వ్యాప్కోస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శంభూ ఆజాద్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. రిజిస్టర్‌లో సంతకం చేసినా.. మినిట్స్‌లో చేయలేదు.

Updated Date - Sep 29 , 2024 | 04:22 AM