Share News

Jupally Krishna Rao: రైతులు, నిరుద్యోగులపై బీఆర్‌ఎస్‌ కపట ప్రేమ

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:19 AM

గత పదేళ్ల పాలనలో రైతులు, నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెట్టిన బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు వారిపై ప్రేమను ఒలకబోస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.

Jupally Krishna Rao: రైతులు, నిరుద్యోగులపై బీఆర్‌ఎస్‌ కపట ప్రేమ

  • పదేళ్లలో వారిని తీవ్ర ఇబ్బందులు పెట్టారు

  • రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు

  • 10 నెలలు నిండని సర్కారుపై విమర్శలా: జూపల్లి

కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): గత పదేళ్ల పాలనలో రైతులు, నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెట్టిన బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు వారిపై ప్రేమను ఒలకబోస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. తాము రైతులకు రుణమాఫీ చేశామని, మరో 4 లక్షల మందికి దీపావళి తర్వాత రుణమాఫీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తున్నామని చెప్పారు. సాగు చేయని భూములకు దాదాపు రూ.25 వేల కోట్ల వరకు బీఆర్‌ఎస్‌ హయాంలో రైతు బంధు ఇచ్చారని విమర్శించారు. తాము దానిని ప్రక్షాళన చేస్తున్నామని, అందుకే రైతు భరోసా ఇచ్చేందుకు కొంత సమయం తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.


కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన మద్ది చంద్రకాంత్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం కామారెడ్డిలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. ధనిక రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీలకే కట్టాల్సి వస్తోందని తెలిపారు. పదేళ్లలో ప్రజలపై మోయలేని భారం మోపిన బీఆర్‌ఎస్‌.. పట్టుమని పది నెలలు నిండని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. త్వరలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయని, గత ప్రభుత్వం చేసిన లూఠీని పట్టభద్రులు గమనించి, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రియాజ్‌, ఎంపీ సురే్‌షషెట్కార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 03:19 AM