Share News

Bhatti Vikramarka: బీటీపీఎస్ అగ్నిప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష..

ABN , Publish Date - Jun 30 , 2024 | 10:19 PM

మణుగూరు-పినపాక మండలాల సరిహద్దున ఉన్న భద్రాద్రి థర్మల్‌ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్‌)లో అగ్నిప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. మధిర క్యాంపు కార్యాలయంలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం నిర్వహించిన సమీక్షలో జెన్కో థర్మల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. పిడుగుపాటు వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో వాటిల్లిన నష్టం వివరాలను అధికారులను అడిగి డిప్యూటీ సీఎం తెలుసుకున్నారు.

Bhatti Vikramarka: బీటీపీఎస్ అగ్నిప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష..

ఖమ్మం: మణుగూరు-పినపాక మండలాల సరిహద్దున ఉన్న భద్రాద్రి థర్మల్‌ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్‌)లో అగ్నిప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. మధిర క్యాంపు కార్యాలయంలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం నిర్వహించిన సమీక్షలో జెన్కో థర్మల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. పిడుగుపాటు వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో వాటిల్లిన నష్టం వివరాలను అధికారులను అడిగి డిప్యూటీ సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్కకు బీటీపీఎస్‌ అధికారులు పలు విషయాలు వివరించారు.


డిప్యూటీ సీఎంకు అధికారులు ఏం చెప్పారంటే?

అగ్నిప్రమాదం వ్యాప్తి చెందకుండా కేవలం గంటలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారులు తెలిపారు. మణుగూరు, పినపాక, అశ్వాపురం నుంచి ఫైర్ ఇంజిన్లు తెప్పించి మంటలను అదుపు చేసినట్లు వివరించారు. అగ్నిప్రమాదాన్ని తనిఖీ చేసేందుకు సోమవారం భోపాల్ నుంచి బీహెచ్ఈఎల్ బృందం రానున్నట్లు చెప్పారు. బీహెచ్ఈఎల్ నిపుణులు పరిశీలన అనంతరం నష్టానికి సంబంధించిన పూర్తి అంచనా వివరాలు రానున్నట్లు డిప్యూటీ సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా బీటీపీఎస్ అగ్నిప్రమాదంపై సమగ్ర నివేదిక తయారు చేసి అందించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆదేశించారు.


ప్రమాదం జరిగిందిలా..!

పిడుగుపాటుతో బీటీపీఎస్‌ మొదటి యూనిట్‌కు చెందిన జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు మంటలు వ్యాపించాయి. దీంతో ముందస్తుగా మొదటి, రెండో యూనిట్లను షట్‌డౌన్‌ చేశారు. ఫైర్‌ ఇంజిన్లతో మంటలు అదుపు చేయడం సాధ్యం కాకపోవటంతో పెద్దఎత్తున ఫోం కెమికల్‌ ఉపయోగించారు. బీటీపీఎస్ సిబ్బంది, కార్మికులు, అగ్నిమాపక సిబ్బంది గంటన్నరపాటు శ్రమించి మంటలు అదుపు చేశారు. ప్రమాద సమయంలో కార్మికులు, ఉద్యోగులు అక్కడ లేకపోవటంతో ప్రాణనష్టం తప్పింది. జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవటంతో కోట్ల రూపాయల్లో నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భోపాల్ బృందం పరిశీలన అనంతరం దీనిపై తుది నివేదిక రానుంది.

Updated Date - Jun 30 , 2024 | 10:19 PM