Minister Ponguleti: గుడ్ న్యూస్.. మరో రెండ్రోజుల్లో వారి ఖాతాల్లో రూ.10వేలు..
ABN , Publish Date - Sep 23 , 2024 | 08:50 PM
వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అన్నదాతల బాధలు చూసి వారిని ఆదుకునేందుకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
ఖమ్మం: తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి ప్రజలు, రైతులు నష్టపోయారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బాధితులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి చెప్పారు. అన్నదాతల బాధలు చూసి వారిని ఆదుకునేందుకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మేరకు మరో రెండ్రోజుల్లో రైతన్నలకు డబ్బులు అందజేయనున్నట్లు పొంగులేటి వెల్లడించారు. నేలకొండపల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
రెండ్రోజుల్లో..
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.."భారీ వర్షాల వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోయారు. ముఖ్యంగా రైతులు బాగా దెబ్బతిన్నారు. కేంద్ర బృందం వచ్చి పరిశీలించినా.. ఇంతవరకూ ఒక్క రూపాయీ రాలేదు. మునిగిన పంట పొలాలకు ఎకరానికి పది వేలు ఇస్తామని చెప్పాం. రెండ్రోజుల్లో రైతులకు పంట పరిహారం కింద మొదటి విడతగా రూ.10వేలు ఇస్తాం. సాగర్ కాలువ నాలుగు చోట్ల తెగింది. పాలేరు దిగువన ఉన్న రైతులందరికీ రేపటి కల్లా నీటిని అందిస్తాం. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో గత ప్రభుత్వ పెద్దలు లక్షల కోట్ల దోచుకున్నారు. గతంలో పంట నష్టం జరిగితే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిహారం ఇచ్చాం. రైతుల పట్ల BRS ప్రభుత్వం కపట ప్రేమ చూపించింది. రుణమాఫీ రూ.14వేల కోట్లు ఉంటే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8వేల కోట్లు మాత్రమే మాఫీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు వారికి లేదు.
అన్నీ అబద్ధాలే..
అమృత్ పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సృజన్ రెడ్డికి రూ.8.888కోట్ల టెండర్లు ఇచ్చినట్లు కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఆయన చేసిన ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తానని చెప్పా. ఎప్పుడు, ఎక్కడికి రావాలో చెప్పమని, రుజువు చేస్తే రాజీనామా చేస్తానని కేటీఆర్‍కు సవాల్ చేశా. దానిపై ఇంతవరకూ సమాధానం లేదు. సిట్టింగ్ జడ్జి దగ్గరకు వెళ్లి మాట్లాడదామా?. అనుభవం ఉందని చెప్పుకునే మీరు ఎవరో చెపితే నింద మోపే ముందు ఆలోచించాలి. ఒక్క రూపాయి అవినీతి జరిగినా జరిగినట్లేనని కేటీఆర్ అంటున్నారు. మీ పార్టీ నుంచి పాలేరులో నా మీద పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి. సృజన్ రెడ్డికి మీ ప్రభుత్వంలో సబ్ కాంట్రాక్టు ఇప్పించారు. అలాంటి సృజన్ రెడ్డిని రేవంత్ రెడ్డి బావమరిదిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిరంతరం ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోంది.
రూ.500 బోనస్..
తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూలగొట్టాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. తెల్లరేషన్ కార్డులు ఇచ్చామని చెప్పేది అబద్ధం. వచ్చే నెల రెండో తారీకు నుంచి స్మార్ట్ కార్డులు ఇవ్వబోతున్నాం. ప్రతీ నియోజకవర్గంలో 3,500కార్డులు ఇస్తాం. సంక్రాంతి లోపే స్మార్ట్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తాం. ఈ ఖరీఫ్ పంట నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్షం ఓర్వలేక నిందలు వేస్తోంది" అని మండిపడ్డారు.