Share News

Komatireddy Venkata Reddy: 15కల్లా ఆర్‌ఆర్‌ఆర్‌ భూ సేకరణ పూర్తి!

ABN , Publish Date - Aug 20 , 2024 | 04:04 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి భూ సేకరణ ప్రక్రియను సెప్టెంబరు 15 కల్లా పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

Komatireddy Venkata Reddy: 15కల్లా ఆర్‌ఆర్‌ఆర్‌ భూ సేకరణ పూర్తి!

  • రైతులకు మంచి ధరలు ఇప్పించేందుకు యత్నిస్తున్నాం

  • ఉత్తర భాగం భూ సేకరణకు సహకరించాలి

  • హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణకు త్వరలో డీపీఆర్‌

  • అధికారులతో సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి భూ సేకరణ ప్రక్రియను సెప్టెంబరు 15 కల్లా పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. రైతుల భూములకు మంచి ధరలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, భూ సేకరణకు సహకరించాలని కోరారు. సోమవారం ఆయన సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖతో పాటు రాష్ట్రంలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.


ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి కావాల్సిన 1941.65 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిందని కోమటిరెడ్డి తెలిపారు. రోడ్డు నిర్మాణంలో ఇప్పటివరకు ఇబ్బందిగా మారిన అటవీ భూములకు ప్రత్యామ్నాయ భూముల కింద మహబూబాబాద్‌ జిల్లాలో 73.04 హెక్టార్ల అటవీయేతర భూములను కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌-విజయవాడ (ఎన్‌.హెచ్‌-65) రహదారిని ఆరు వరసలుగా విస్తరించే ప్రక్రియ వేగంగా సాగుతోందన్నారు. డీపీఆర్‌ తయారీకి కన్సల్టెంట్లను నియమించేందుకు కేంద్రం ఇప్పటికే టెండర్లు పిలిచిందని తెలిపారు.


అలాగే ఈ రహదారిపై గుర్తించిన 17 బ్లాక్‌స్పాట్ల పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులకు సూచించారు. ఈ పనులకు రూ.422.12 కోట్లను వెచ్చించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇక మన్నెగూడ జాతీయ రహదారి నిర్మాణ టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని, కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించేందుకు ఈ వారంలోనే తేదీని ఖరారు చేస్తామని చెప్పారు. నాగ్‌పూర్‌-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి సంబంధించి కూడా టెండర్‌ ప్రక్రియ పూర్తయిందన్నారు. అయితే పనుల ప్రారంభానికి తేదీ వచ్చేలోగా పెండింగ్‌లో ఉన్న భూ సేకరణను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - Aug 20 , 2024 | 04:04 AM