రాహుల్ కులంతో బీజేపీకి ఏం పని?: సురేఖ
ABN , Publish Date - Nov 07 , 2024 | 03:33 AM
‘రాహుల్‌గాంధీ కులం ఏంటన్నది తెలియాలంటే దేశంలో కులగణన చేయండి. కులగణన పత్రంతో రాహుల్ ఇంటికి వెళితే.. తన కులమేదో ఆయనే చెబుతారు’ అంటూ బీజేపీ నేతలకు మంత్రి కొండా సురేఖ సలహా ఇచ్చారు.
హైదరాబాద్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘రాహుల్‌గాంధీ కులం ఏంటన్నది తెలియాలంటే దేశంలో కులగణన చేయండి. కులగణన పత్రంతో రాహుల్ ఇంటికి వెళితే.. తన కులమేదో ఆయనే చెబుతారు’ అంటూ బీజేపీ నేతలకు మంత్రి కొండా సురేఖ సలహా ఇచ్చారు. రాహుల్ కులంతో బీజేపీ వాళ్లకు ఏం పనంటూ ప్రశ్నించారు. కొన్ని వర్గాలకు మాత్రమే మేలు చేసే పార్టీ బీజేపీ అన్నారు. మంత్రితో ముఖా ముఖి కార్యక్రమంలో భాగంగా బుధవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల నుంచి వివిధ సమస్యలపైన వినతిపత్రాలు, ఫిర్యాదులను కొండా సురేఖ స్వీకరించారు.
ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ.. కుల వివక్షను రూపు మాపేందుకే కులగణన సర్వేను ప్రభుత్వం చేపట్టిందన్నారు. కాగా, రాహుల్ గాంధీది బ్రాహ్మణ కులం.. హిందూ మతమని బీజేపీ నేతలకు అది కూడా తెలియదా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హన్మంతరావు ప్రశ్నించారు. కులగణన చేయాలన్న గొప్ప నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి.. విమర్శలు దేనికని ప్రశ్నించారు.