Share News

Fire Accident: జనగామలో భారీ అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Oct 28 , 2024 | 03:58 AM

జనగామలో ఆదివారం తెల్లవారుజామున ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పదికి పైగా దుకాణాలు దగ్ధమై పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది.

Fire Accident: జనగామలో భారీ అగ్ని ప్రమాదం

  • షాపింగ్‌ కాంప్లెక్స్‌లో చెలరేగిన కీలలు

  • పది దుకాణాలకు వ్యాపించిన మంటలు

  • 20 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా

జనగామ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జనగామలో ఆదివారం తెల్లవారుజామున ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పదికి పైగా దుకాణాలు దగ్ధమై పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానిక సిద్దిపేట రోడ్డులో ఉన్న విజయ షాపింగ్‌ మాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు మంటలు చెలరేగాయి. మొదట్లో కొద్దిపాటి పొగలు రావడాన్ని గమించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి విజయ షాపింగ్‌ మాల్‌ షట్టర్లు తెరుచుకోలేదు. దాంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మంటలు ఆ కాంప్లెక్స్‌లోని ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌, శ్రీలక్ష్మీ షాపింగ్‌ మాల్‌కు వ్యాప్తిచెందాయి.


షట్టర్లను జేసీబీ సాయంతో తొలగించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. మధ్యాహ్నం 1.30తర్వాత కొద్దిగా అదుపులోకి వచ్చాయి. జనగామ జిల్లాలో వేర్వేరుచోట్ల నుంచి రప్పించిన 6 ఫైరింజన్లతో సుమారు 40 మంది అగ్నిమాపక సిబ్బంది ఏడు గంటలకు పైగా శ్రమించారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌కు ఆనుకొని ఉన్న మరో భవనంపైకి ఎక్కి ‘ఫైర్‌ కెమ్‌’ (ఫోమ్‌) రసాయనాన్ని నీటితో కలిపి చల్లారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విజయ షాపింగ్‌ మాల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

Updated Date - Oct 28 , 2024 | 03:58 AM