Share News

Minister Seethakka : సర్కారీ లాలన

ABN , Publish Date - Nov 08 , 2024 | 04:16 AM

రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటి వరకూ ప్రైవేటులో ఉన్నత వర్గాలకు మాత్రమే డే కేర్‌ సెంటర్లు అందుబాటులో ఉండగా.. సర్కారు ఆధ్వర్యంలో పేదల కోసం ‘క్రెష్‌’లు ఏర్పాటు కానున్నాయి.

Minister Seethakka : సర్కారీ లాలన

  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రెష్‌ల ఏర్పాటు

  • రెండున్నరేళ్లలోపు పిల్లల సంరక్షణే లక్ష్యం

  • ‘అంగన్‌వాడీ’ల తరహాలో నిర్వహణ

  • త్వరలో నోటిఫికేషన్‌ జారీ

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటి వరకూ ప్రైవేటులో ఉన్నత వర్గాలకు మాత్రమే డే కేర్‌ సెంటర్లు అందుబాటులో ఉండగా.. సర్కారు ఆధ్వర్యంలో పేదల కోసం ‘క్రెష్‌’లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని రెండున్నరేళ్లలోపు పిల్లలను ఈ కేంద్రాల్లో చేర్చుకుంటారు. ఇందుకు సంబంధించి మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. రెండున్నరేళ్లలోపు పిల్లలున్న తల్లులు.. పనికి వెళ్లేందుకు అవకాశం ఉండదు. దాంతో వారు ఉపాధి కోల్పోవడమే కాకుండా.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

అయితే, పిల్లల కారణంగా మహిళలెవరూ ఉపాధి కోల్పోకూడదన్న ఉద్దేశంతో సర్కారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ కేంద్రాల్లో ప్రధానంగా పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం, సమయానికి భోజనం అందించడం, నిద్రపుచ్చడంతోపాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల తరహాలోనే క్రెష్‌ల్లోనూ ఇద్దరేసి చొప్పున సిబ్బందిని నియమించనున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో స్థలం ఉంటే అక్కడ, లేదంటే వేరే భవనంలో క్రెష్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.

అంతేకాదు.. రెండున్నరేళ్లలోపు వయసున్న పిల్లల తల్లులనే సిబ్బందిగా నియమించే అవకాశాన్నీ పరిశీలిస్తున్నారు. ఆ వయసు పిల్లలకు ఏ సమయానికి ఏం ఆహారం అందించాలన్న అంశంపై అవగాహన ఉంటుందన్న అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఆ తర్వాత సిబ్బందిని నియమించనున్నారు. ఈ కేంద్రాలు ఏర్పాటైతే.. రెండున్నరేళ్లలోపు పిల్లలున్న తల్లులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పని చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, వారి ఉపాధికి ఇబ్బంది ఉండదని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో పేర్కొన్నారు.


  • మహిళల ఉపాధిని పెంపొందించడమే లక్ష్యం

6 నెలల నుంచి రెండున్నరేళ్లలోపు వయసున్న పిల్లల పర్యవేక్షణ కోసం ‘క్రెష్‌’లను తీసుకురానున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోజు వారీ పనికి వెళ్తే తప్ప పూట గడవని కుటుంబాలు, మహిళలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. రెండు న్నరేళ్లలోపు వయసున్న పిల్లలను సంరక్షించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల.. ఆ పిల్లల తల్లులు పనికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా వారు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ‘క్రెష్‌’లను అంగన్‌వాడీల తరహాలోనే నిర్వహిస్తాం. సిబ్బందినీ ప్రత్యేకంగా తీసుకుంటాం.

- సీతక్క, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి

Updated Date - Nov 08 , 2024 | 04:21 AM