MP Eatala: నిజాం కంటే దుర్మార్గమైన పాలన..
ABN , Publish Date - Sep 28 , 2024 | 10:42 AM
కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో సామాన్య ప్రజల్లో భయం సృష్టిస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) మండిపడ్డారు. ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నివాసాలను కూల్చివేస్తామంటూ అధికారులు పలు కాలనీల ప్రజలకు నోటీసులు ఇవ్వడంతో శుక్రవారం ఆయన మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు.
- రేవంత్ సర్కార్‌పై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
- పేదల ఇళ్లను కూలిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక
- మూసీ పరివాహకంలోనే రాత్రి బస.. నచ్చజెప్పి పంపిన పోలీసులు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో సామాన్య ప్రజల్లో భయం సృష్టిస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) మండిపడ్డారు. ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నివాసాలను కూల్చివేస్తామంటూ అధికారులు పలు కాలనీల ప్రజలకు నోటీసులు ఇవ్వడంతో శుక్రవారం ఆయన మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. మచ్చబొల్లారం డివిజన్‌లోని జొన్నబండ వడ్డెర బస్తీ, చైతన్యపురి, కొత్తపేట డివిజన్‌ల పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ ఈటలకు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఇదికూడా చదవండి: Amrapali: నగరం చుట్టూ డంపింగ్ యార్డులు..
అల్వాల్‌లో..
అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్‌లోని జొన్నబండ వడ్డెర బస్తీలో 70 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలకు తహసీల్దార్ నోటీసులు ఇవ్వడంపై ఈటల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భూ కబ్జాదారులకు, ల్యాండ్ మాఫియాలకు, పైరవీకారులకు అండగా ఉంటూ పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని, పేదల ఇళ్లు కూలగొట్టి వారి బతుకుల్లో మట్టికొట్టే దుర్మార్గానికి ఒడిగట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నిజాం కంటే దుర్మార్గమైన పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.
శని, ఆదివారాల్లో కూల్చివేతలు అందుకే..
కొత్తపేట కార్పొరేటర్ పవన్‌కుమార్‌తో కలిసి శుక్రవారం సత్యానగర్ జనప్రియ అవెన్యూ అపార్టుమెంట్ల సముదాయాన్ని ఎంపీ ఈటల సందర్శించారు. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఆందోళనకు గురైన అపార్టుమెంట్ వాసులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులు కోర్టును ఆశ్రయిస్తారనే ఆలోచనతో దొంగల్లాగా శని, ఆదివారాల్లో ఇళ్లను కూల్చి వేస్తున్నారని విమర్శించారు. మూసీ లోతు పెంచాలని, భూ సంరక్షణకు ప్రహరీ నిర్మించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. పైసా పైసా కూడబెట్టి ప్రభుత్వ అనుమతులు, నిబంధనలకు అనుగుణంగా పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని.. బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ పేరుతో ఇప్పుడు కూల్చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అంటే ప్రభుత్వానికి విలువ లేదని, పేదలంటే గౌరవం లేదని విమర్శించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, తాము అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు.
చైతన్యపురి, కొత్తపేట డివిజన్ల పరిధిలో..
ఎల్‌బీనగర్ నియోజకవర్గం పరిధిలోని చైతన్యపురి, కొత్తపేట డివిజన్‌లలోని మూసీపరివాహక ప్రాంతాల్లో శుక్రవారం ఈటల రాజేందర్ పర్యటించారు. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన స్థలాల్లో ఇళ్లను నిర్మించుకున్న వారిని భయభ్రాంతులకు గురిచేయడం తగదని, మార్కింగ్ చేస్తున్న అధికారులు వెళ్లిపోయే వరకు కదిలేది లేదంటూ ఆయన న్యూ మారుతినగర్ కాలనీ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి నాటకాలు ఆడుతున్నారని, మహిళల కళ్లల్లో కన్నీరు చూడడం మంచిది కాదని హితవు పలికారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో దోచుకుంటే... కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరిట దోచుకుంటుందని ఆరోపించారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీ చేయించే కార్యక్రమాన్ని ఆపకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రోడ్డుపై బైఠాయించిన ఆయన రాత్రి సైతం మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉండేందుకు నిర్ణయించుకున్నారు. రాత్రి 7 గంటల సమయంలో ఫణిగిరి కాలనీలోని సాయిబాబా దేవాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. రాత్రి ఆలయంలోనే బస చేసేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు, ఎంపీ ఈటల రాజేందర్‌కు ఫోన్‌చేసి నచ్చజెప్పడంతో ఆలయంలో కూర్చున్న ఆయన అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. పేదల ఇళ్లను కూల్చివేతలను ఆపేయాలని పోలీసు అధికారులకు స్పష్టంచేశారు. ఏ సమయంలో అవసరమున్నా ఫోన్‌చేస్తే, గంటలో వస్తానని నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. బీజేఎల్పీ నేత ఆలేటి మహశ్వర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి సైతం శుక్రవారం సాయంత్రం న్యూ మారుతినగర్‌కు చేరుకున్నారు.
ఇదికూడా చదవండి: హర్ష సాయి కేసులో కొత్త ట్విస్ట్..
ఇదికూడా చదవండి: కాంగ్రెస్‌కు పోయే కాలం దగ్గర పడింది..
ఇదికూడా చదవండి: మేము నిర్మిస్తే కాంగ్రెస్ కూల్చేస్తోంది: కేటీఆర్
ఇదికూడా చదవండి: పెద్ద వెంచర్లన్నీ పెండింగ్‌లోనే!
Read Latest Telangana News and National News