Share News

NEET PG: పీజీ వైద్య విద్య ప్రవేశాలు ఎన్నడో?

ABN , Publish Date - Oct 06 , 2024 | 03:30 AM

రాష్ట్రంలో వైద్యవిద్య పీజీ ప్రవేశాలపై ఇంతవరకు స్పష్టత రాలేదు. హెల్త్‌ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్‌ రాకపోవడంపై నీట్‌ పీజీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

NEET PG: పీజీ వైద్య విద్య ప్రవేశాలు ఎన్నడో?

ఇంకా నోటిఫికేషన్‌ ఇవ్వని ఆరోగ్య వర్సిటీ.. అఖిలభారత కోటాకు పూర్తయిన రిజిస్ట్రేషన్‌

  • యూజీ ప్రవేశాల్లో బిజీగా ఉన్న హెల్త్‌ వర్సిటీ

  • స్థానికత జీవోతో రాష్ట్ర విద్యార్థులకు నష్టం

  • వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని మెడికోల విజ్ఞప్తి

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్యవిద్య పీజీ ప్రవేశాలపై ఇంతవరకు స్పష్టత రాలేదు. హెల్త్‌ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్‌ రాకపోవడంపై నీట్‌ పీజీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీజీ ఆలిండియా కోటా సీట్లకు మెడికల్‌ కౌన్సిలింగ్‌ కమిటీ (ఎంసీసీ) ఇప్పటికే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసింది. పీజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. ఆలోగా మనదగ్గర కూడా ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఇవ్వాలి. నీట్‌ పీజీ ఎంట్రెన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించాలి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు డీమ్డ్‌, సెంట్రల్‌ వర్సిటీల్లో 50 శాతం సీట్లను ఆలిండియా కోటా కింద భర్తీ చేస్తారు.


మిగిలిన 50 శాతం సీట్లను ఆయా రాష్ట్రాల హెల్త్‌ వర్సిటీలు భర్తీ చేస్తుంటాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి, లోకల్‌ మెరిట్‌ జాబితాను విడుదల చేశాయి. కానీ, మనదగ్గర ఇంతవరకు నోటిఫికేషన్‌ ఎందుకు విడుదల చేయలేదని వైద్యవిద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అలాగే నీట్‌ పీజీ మెరిట్‌ జాబితాను విడుదల చేయకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌లో పాల్గొనాలా? వద్దా? అన్న విషయాన్ని తేల్చుకోలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మన దగ్గర స్థానికత జీవో కారణంగా యూజీ ప్రవేశాల ప్రక్రియ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ ప్రక్రియలో హెల్త్‌ వర్సిటీ బిజీగా ఉంటోందని, అందుకే పీజీ ప్రవేశాలపై స్పష్టత ఇవ్వలేదని వైద్యవర్గాలు వెల్లడించాయి.


  • స్థానికత జీవోతో తీవ్ర నష్టం..

స్థానికత జీవో ప్రకారం.. ప్రస్తుతం వైద్యవిద్య ప్రవేశాలకు ముందు వరసగా నాలుగేళ్ల పాటు రాష్ట్రంలో చదివి ఉండాలి. అంటే పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో కేవలం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ చేసిన విద్యార్థులే అర్హులవుతారు. తెలంగాణ స్థానికత ఉండి ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వారంతా స్థానికేతరులుగా మారిపోనున్నారు. ఆలిండియా టాప్‌ ర్యాంకర్లు సహజంగా ఎయిమ్స్‌, జిప్‌మర్‌ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో చదివేందుకు ఆసక్తి చూపుతారు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో ఆలిండియా 15 శాతం కోటా కింద సీటు వస్తే దేశంలోని ఏ రాష్ట్రంలో సీటొస్తే అక్కడే వైద్యవిద్యను పూర్తిచేస్తారు.


రాష్ట్రం నుంచి ఏటా 150-200 మంది విద్యార్థులు ఆలిండియా కోటా సీట్లకు పోటీ పడడమే కాకుండా.. ఎక్కడ సీటు వస్తే అక్కడికి వెళ్లి వైద్యవిద్యను పూర్తి చేసి వస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ తీసుకొచ్చిన తాజా స్థానికత జీవో ప్రకారం ఇప్పుడు వారంతా స్థానికేతరులుగా మారతారు. రాష్ట్రంలో పీజీ వైద్యవిద్యను అభ్యసించే అవకాశాన్ని కోల్పోతారు. అన్నింటికీ మించి అసలు దరఖాస్తు చేసుకునే అర్హత కూడా వారికి ఉండదు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 2548 పీజీ సీట్లున్నాయి. ఇందులో 1676 డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (ఎండీ), 848 మాస్టర్‌ ఆఫ్‌ సర్జరీ (ఎంఎస్‌), 23 పీజీ డిప్లొమో సీట్లు ఉన్నాయి.


  • వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలి: ఓ పీజీ అభ్యర్థి

కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ తక్షణమే పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు అవకాశం కల్పించాలి. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో మెరిట్‌ జాబితాను కూడా విడుదల చేశారు. నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందా? అని హెల్త్‌ వర్సిటీ వెబ్‌సైట్‌ను చూస్తున్నాం. వర్సిటీకి ఫోన్‌ చేసినప్పటికీ ఎవరూ స్పందించడం లేదు. తక్షణమే వైద్య మంత్రి స్పందించి, నోటిఫికేషన్‌ విడుదలయ్యేలా చొరవ తీసుకోవాలి.

Updated Date - Oct 06 , 2024 | 03:30 AM