Share News

JNTU: కాలం చెల్లిన మైదా.. కుళ్లిన కూరగాయలు!

ABN , Publish Date - Jun 30 , 2024 | 03:37 AM

విద్యార్థుల విషయంలో జేఎన్‌టీయూ అధికారుల నిర్లక్ష్యం రోజుకో రకంగా వెలుగులోకి వస్తోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ జేఎన్‌టీయూ క్యాంటీన్‌లో కాలం చెల్లిన బియ్యం పిండితో ఆహార పదార్థాలు తయారుచేసినట్లు వెల్లడి కాగా,

JNTU: కాలం చెల్లిన మైదా.. కుళ్లిన కూరగాయలు!

  • సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూలో బయటపడ్డ నిర్లక్ష్యం

  • పనిచేయని ఆర్వో ప్లాంట్‌.. కరువైన మంచినీరు

  • ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీ.. నోటీసులు జారీ

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల విషయంలో జేఎన్‌టీయూ అధికారుల నిర్లక్ష్యం రోజుకో రకంగా వెలుగులోకి వస్తోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ జేఎన్‌టీయూ క్యాంటీన్‌లో కాలం చెల్లిన బియ్యం పిండితో ఆహార పదార్థాలు తయారుచేసినట్లు వెల్లడి కాగా, తాజాగా సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ కాలేజీలోనూ కాలం చెల్లిన మైదాపిండిని వినియోగిస్తున్న వైనం బయటపడింది. గత వారం రోజుల్లో రెండుసార్లు జేఎన్‌టీయూ క్యాంటీన్‌/కాలేజీల్లో ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.


పాడైన సుమారు 25 కిలోల కూరగాయలు, కాలం చెల్లిన 15 కిలోల మైదాపిండిని గుర్తించిన అధికారులు వాటిని ప్రాంగణం వెలుపల పారపోశారు. మరోవైపు ఎలుకలు, వాటి విసర్జితాలతో స్టోర్‌రూమ్‌ అపరిశుభ్రంగా ఉండడాన్ని గుర్తించారు. వంటగది, భోజనశాల, పాత్రలు కడిగే ప్రదేశం కూడా అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించారు. ఆహార పదార్థాలు అందించే సిబ్బంది సరైన పద్ధతులు పాటించకపోవడం, ఆర్వో ప్లాంట్‌ పనిచేయకపోవడం కూడా వారి దృష్టికి వచ్చింది. తమ తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన అంశాలను పొందుపరుస్తూ బాధ్యులకు నోటీసులు జారీచేశారు. కాలేజీ అధికారుల నుంచి వచ్చే వివరణను పరిశీలించిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ పేర్కొన్నారు.

Updated Date - Jun 30 , 2024 | 03:37 AM