Share News

Teacher postings: కొత్త టీచర్లకు నేడు పోస్టింగ్‌లు

ABN , Publish Date - Oct 15 , 2024 | 03:25 AM

రాష్ట్రంలో కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులకు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు.

Teacher postings: కొత్త టీచర్లకు  నేడు పోస్టింగ్‌లు

  • జిల్లా యూనిట్‌గా ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహణ

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులకు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన ఉపాఽధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే ఇందులో 10,006 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు మంగళవారం జిల్లా యూనిట్‌గా పోస్టింగ్‌లను ఇవ్వనున్నారు.


ఇందుకోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు డీఈవో ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త ఉపాధ్యాయులంతా ఉదయం ఆయా జిల్లాల కలెక్టర్‌ కార్యాయాలయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ముందుగా స్కూల్‌ అసిస్టెంట్‌, పండిట్‌, వ్యాయామ ఉపాధ్యాయులకు ఉదయం 9.30 గంటలకు కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు ఎస్‌జీటీలకు కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. డీఎస్సీలో అభ్యర్థులు సాధించిన మెరిట్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌లో పోస్టింగ్‌లను ఇవ్వనున్నారు. ఒకవేళ ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకాని ఉపాధ్యాయులకు మిగిలిపోయిన ఖాళీల్లో పోస్టింగ్‌లను ఇవ్వనున్నారు.

Updated Date - Oct 15 , 2024 | 03:25 AM