Share News

Hyderabad: రెడ్‌స్టోన్‌ హోటల్‌లో నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య!

ABN , Publish Date - Sep 17 , 2024 | 01:49 AM

జడ్చర్లకు చెందిన ఓ నర్సింగ్‌ విద్యార్థిని హైదరాబాద్‌లోని హోటల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఉదంతమిది. ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు.

Hyderabad: రెడ్‌స్టోన్‌ హోటల్‌లో నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య!

  • హత్యాచారంగా కుటుంబ సభ్యుల అనుమానం

  • పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ.. నిర్ధారించలేమంటున్న పోలీసులు

  • ఆత్మహత్యగా కేసు నమోదు

రాయదుర్గం, జడ్చర్ల/కోస్గి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జడ్చర్లకు చెందిన ఓ నర్సింగ్‌ విద్యార్థిని హైదరాబాద్‌లోని హోటల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఉదంతమిది. ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. హోటల్‌ గదిలోని పరిస్థితులు ఇందుకు బలం చేకూరుస్తున్నాయని చెబుతున్నారు. మాదాపూర్‌ ఏసీపీ శ్రీకాంత్‌ కథనం ప్రకారం.. జడ్చర్లలోని కుమ్మరివాడకు చెందిన నర్సింగ్‌ విద్యార్థిని శ్రుతి(23) గతంలో మాదాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేశారు. పది రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లారు. ఈ నెల 14న తాను పనిచేసిన ఆస్పత్రిలో రావాల్సిన గౌరవ వేతనానికి సంబంధించి హైదరాబాద్‌ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరారు. ఆమెకు గతంలో పరిచయం ఉన్న జీవన్‌, వెంకటేశ్‌, మోనతో కలిసి గచ్చిబౌలిలోని రెడ్‌స్టోన్‌ హోటల్‌లో 301, 501 నంబరు గల గదులను అద్దెకు తీసుకున్నారు.


జడ్చర్లకు చెందిన తామంతా వినాయక నిమజ్జనాలను వీక్షించేందుకు హైదరాబాద్‌ వచ్చినట్లు హోటల్‌ రిసెప్షన్‌లో చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం తనకు తలనొప్పిగా ఉందంటూ శ్రుతి హోటల్‌ గదిలోనే ఉండగా.. మిగతా ముగ్గురు నిమజ్జనాలను వీక్షించేందుకు ట్యాంక్‌బండ్‌కు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో హోటల్‌కు తిరిగి వచ్చి.. 501వ నంబరు గది తలుపులు తట్టగా.. శ్రుతి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆమె ఫోన్‌ రింగ్‌ అవుతున్నా.. లిఫ్ట్‌ చేయలేదు. దీంతో.. హోటల్‌ సిబ్బందిని పిలిపించి, మారు తాళంచెవితో గది తలుపు తెరిపించగా.. శ్రుతి ఫ్యాన్‌కు వేళాడుతూ.. విగతజీవిగా కనిపించింది. హోటల్‌ సిబ్బంది సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు సంఘటనాస్థలికి వచ్చి, అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో కారు డ్రైవింగ్‌ నేర్చుకునేప్పుడు జీవన్‌ పరిచయమైనట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. శ్రుతి ఆత్మహత్యపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


శ్రుతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెబుతున్నారు. ఆమె విషయంలో జరగరానిది ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం తాము వచ్చేసరికి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలిస్తున్నారని ఆరోపించారు. బంధుమిత్రులు కాసేపు అంబులెన్స్‌ను ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. శ్రుతి గదిలో రక్తపు మరకలు, మద్యం సీసాలున్నాయని, గది అంతా చిందరవందరగా ఉండడాన్ని బట్టి ఆమెపై హత్యాచారం జరిగి ఉంటుందని ఆరోపించారు. దీనిపై ఏసీపీ శ్రీకాంత్‌ స్పందిస్తూ.. ప్రస్తుతానికి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ శ్రుతిది ఆత్మహత్యా? లేక హత్యా? అనేది తెలియదని పేర్కొన్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పోలీసులను కోరారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులతో ఫోన్‌లో మాట్లాడారు.

Updated Date - Sep 17 , 2024 | 01:49 AM