Share News

BRS: కేసీఆర్‌తో సమావేశానికి మహిపాల్‌రెడ్డి డుమ్మా.. ఢిల్లీలో హఠాత్తుగా ప్రత్యక్షం!

ABN , Publish Date - Jun 26 , 2024 | 02:56 AM

పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు.

BRS: కేసీఆర్‌తో సమావేశానికి మహిపాల్‌రెడ్డి డుమ్మా.. ఢిల్లీలో హఠాత్తుగా ప్రత్యక్షం!

  • హఠాత్తుగా ప్రత్యక్షమైన ఎమ్మెల్యే

  • కేసీఆర్‌తో సమావేశానికి డుమ్మా

  • ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం

  • కోర్టు పనిమీదే ఢిల్లీకి అంటూ వివరణ

పటాన్‌చెరు, జూన్‌ 25: పలువురు బీఆర్‌ఎస్‌ (BRS) ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు. ఆయన హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్ష్యం కావడం కలకలం రేపింది. పార్టీ ఫిరాయించే అవకాశం ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో ముందునుంచీ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మహిపాల్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు చేసిన ఈడీ.. సుమారు 300 కోట్ల అక్రమ నగదు లావాదేవీలపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొనడంతో రాజకీయ దుమారం రేగింది. మరోపక్క బీఆర్‌ఎస్‌ నుంచి ఎవరూ చేజారకుండా అధినేత కేసీఆర్‌ మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.

Gudem.jpg

ఈ సమావేశానికి గైర్హాజరయిన మహిపాల్‌ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షం కావడంతో ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే.. తాను ఏ నాయకుడిని కలిసేందుకు ఢిల్లీకి రాలేదని, వ్యక్తిగత పనిమీద లాయర్లను సంప్రదించేందుకు వచ్చానని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి వివరణ ఇవ్వడం గమనార్హం. కేసీఆర్‌ నిర్వహించిన అత్యవసర సమావేశానికి విదేశాల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులు సైతం ఆఘమేఘాలపై తిరిగి రాగా.. మహిపాల్‌ రెడ్డి మాత్రం ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే బలమైన నేతగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి పేరుంది.


Harish-At-Gudem.jpg

మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనను కాపాడుకోవడం బీఆర్‌ఎస్‌కు కీలకంగా భావిస్తున్నారు. ఈడీ దాడుల అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ ధైర్యం చెప్పారు. మరోపక్క కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలూ మహిపాల్‌రెడ్డిని టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూధన్‌రెడ్డిపై మైనింగ్‌, రెవెన్యూ శాఖలు కేసులు నమోదు చేయడంతో.. ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ ఎమ్మెల్యే అక్రమాస్తులపై దృష్టి కేంద్రీకరించింది.

Gudem-Mahipal-Reddy-And-Dam.jpg

ఈ నేపథ్యంలో పార్టీ మారాలంటూ.. మహిపాల్‌రెడ్డిపై కాంగ్రె స్‌, బీజేపీ రెండు పార్టీలు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఇటీవల మెదక్‌ లోక్‌సభ సీటు బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ జిల్లాలో బలోపేతం అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు ప్రచారానికి బలం చేకూర్చే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతలను కలిసేందుకు వెళ్లారా.. లేదా బీజేపీ అధిష్ఠానం ఆశీస్సుల కోసం వెళ్లారా? అన్నదానిపై చర్చ జరుగుతోంది.

Updated Date - Jun 26 , 2024 | 08:09 AM