Sridhar Babu: గ్రీన్ ఫార్మా సిటీలో భారీ పెట్టుబడులు
ABN , Publish Date - Nov 07 , 2024 | 02:49 AM
హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్మా రంగంలోని దిగ్గజ కంపెనీలు ముందుకువచ్చాయి. ఇందులో డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటెరో, ఎంఎ్‌సఎన్, లారస్ కంపెనీలున్నాయి.
ముందుకొచ్చిన డాక్టర్ రెడ్డీస్, హెటెరో, అరబిందో, ఎంఎ్‌సఎన్, లారస్
ఒక్కోటి 50 ఎకరాల్లో ప్రారంభించేలా ప్రతిపాదనలు
ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్మా రంగంలోని దిగ్గజ కంపెనీలు ముందుకువచ్చాయి. ఇందులో డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటెరో, ఎంఎ్‌సఎన్, లారస్ కంపెనీలున్నాయి. అయితే విస్తరణలో భాగంగా భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసినా.. పెట్టుబడుల వివరాలను వెల్లడించలేదు. ఆయా సంస్థల ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. గ్రీన్ ఫార్మా సిటీకి సంబంధించిన ప్రణాళికను మంత్రి వివరించగా.. వారు తమ ప్రతిపాదనలను ఆయన ముందుంచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రీన్ ఫార్మా సిటీలో యుద్థ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ఏడాదిలోపు పరిశ్రమల నిర్మాణానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఐదు కంపెనీలు ఫార్మా సిటీలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు ఏర్పాటు కానున్న ఫ్యూచర్ సిటీలో ఫార్మా నగరం కూడా భాగంగా ఉంటుందని తెలిపారు. తొలి దశలో ఒక్కో కంపెనీ 50 ఎకరాల స్థలంలో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించినట్టు వెల్లడించారు. గ్రీన్ ఫార్మా సిటీకి మంచినీరు, విద్యుత్తు సరఫరా ఇప్పటికే ప్రారంభమైనట్టు చెప్పారు. కొంగరకలాన్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ వరకు 300 అడుగుల వెడల్పుతో ప్రపంచ స్థాయి రహదారి నిర్మించనున్నామని.. వచ్చే జూన్ నాటికి ఈ రోడ్డు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. భారీ ఫార్మా పరిశ్రమల కోసం లాజిస్టిక్స్ పార్క్, ప్యాకేజింగ్ పార్క్, కార్మికుల కోసం డార్మిటరీలు నిర్మిస్తామన్నారు. ప్రతి పరిశ్రమ ప్రత్యేకంగా బాయిలర్లు ఏర్పాటు చేయనవసరం లేకుండా పైపుల ద్వారా వేడి నీటి ఆవిరి (స్టీమ్) అందించే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. త్వరలో పరిశ్రమల విద్యుత్తు విధానాన్ని ప్రకటించనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ మల్సూర్ కూడా పాల్గొన్నారు.
‘డెన్సో’ రాకతో వాహనాల పరిశ్రమకు ఊతం
జపాన్‌కు చెందిన వాహనాల విడిభాగాల తయారీ సంస్థ డెన్సో టీహబ్‌తో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డెన్సో లాంటి అగ్రగామి సంస్థల రాకతో రాష్ట్రం వాహనాల తయారీ రంగంలో సుస్థిర ఆవిష్కరణలతో మరింత ముందుకు దూసుకుపోతుందన్నారు. రాష్ట్రంలోని ఆటోమోటివ్ డిజైన్, చిప్‌ల తయారీ, సెన్సార్ ఇంజనీరింగ్ సంస్థలు ఆటోమోటివ్ రంగ అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పతాయని చెప్పారు. మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఫోర్జ్, ఎక్సైడ్, అమర రాజా బ్యాటరీస్ వంటి దిగ్గజ సంస్థలు అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పడం ద్వారా, సంప్రదాయ ఆటోమోటివ్ కాంపోనెంట్స్, నూతన ఎలక్ర్టిక్ వాహన సాంకేతికతలకు తెలంగాణ కేంద్రంగా మారిందని వెల్లడించారు. కార్యక్రమంలో డెన్సో భారత ప్రాంతీయ సీఈవో యశుహిరో లిడా, డైరెక్టర్ ఎయిజీ సోబుయే, టీహబ్ సీఈవో సుజిత్ జాగీర్దార్ తదితరులు పాల్గొన్నారు.
కులగణన సర్వే ప్రారంభించిన మంత్రి..
రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో సమగ్ర కులగణన సర్వేను ఆ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సర్వేతో రాష్ట్రంలోని కుటుంబాల సమగ్ర వివరాలు తెలుస్తాయని, సంక్షేమ పథకాలు మరింత పకడ్బందీగా అమలు చేయవచ్చని వెల్లడించారు. అంతకుముందు శంకర్‌పల్లి హనుమాన్ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.